Harish Rao: పోలీసులూ తీరు మార్చుకోండి!
ABN, Publish Date - Sep 24 , 2024 | 03:39 AM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించాలని, ఏడీజీ స్థాయి నుంచి పోలీసు శాఖలోని ఉన్నత అధికారులపై వేటు వేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
లేదంటే ఏపీలో అధికారులకు పట్టిన గతే..
ఖమ్మంలో 9 సీట్లిస్తే.. 3లక్షల ఎకరాలు ఎండబెడతారా?
రేవంత్ సర్కార్‌కు కూల్చడం తప్ప పూడ్చడం రాదా?: హరీశ్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించాలని, ఏడీజీ స్థాయి నుంచి పోలీసు శాఖలోని ఉన్నత అధికారులపై వేటు వేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తే ఇక్కడి పోలీసులకూ ఏపీ పోలీసులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర; పువ్వాడ అజయ్, సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వెళ్లిన తమపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడితే.. వారిని వదిలేసి, బీఆర్‌ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం సరికాదని చెప్పారు. ఏ పార్టీకీ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.
ప్రభుత్వానికి కొమ్ము కాస్తే.. భవిష్యత్తులో ఏపీలో మాదిరిగానే సస్పెన్షన్లు ఎదుర్కోవాల్సి వస్తుందని హరీశ్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ప్రజలు 9 ఎమ్మెల్యే సీట్లిచ్చి, కాంగ్రె్‌సకు అధికారం కట్టబెడితే.. వరదల్లో హెలికాప్టర్ ఏర్పాటు చేయకుండా 9 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సాగర్‌లో నీరున్నా.. 3 లక్షల ఎకరాల్లో పంటలను ఎండ బెడతారా? అని ప్రశ్నించారు. కాంగ్రె్‌సను గెలిపించడం ఖమ్మం ప్రజలకు శాపంగా మారిందన్నారు. సీఎం రేవంత్ నిర్లక్ష్యం, ముగ్గురు మంత్రుల సమన్వయ లోపం కారణంగా.. రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. 22 రోజుల నుంచి కాల్వ గండి పూడ్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. సాగర్ నీళ్లతో పనిలేకుండా సీతారామ ద్వారా ఖమ్మంలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు.
ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న సీఎంకు, ఖమ్మం జిల్లా మంత్రులకు కాల్వ గండి పూడ్చడం చేత కావడం లేదని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి సర్కారుకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు రావా..? అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయన్న ఉద్దేశంతోనే హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ సీఎం ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని రైతులు పార్టీలకతీతంగా ఎన్‌ఎ్‌సపీ కార్యాలయాలను ముట్టడించి నిరసన తెలుపుతున్నారని చెప్పారు. వరదల వల్ల సాగర్ పరివాహక ప్రాంతాల్లో 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాలున్నాయన్నారు.
వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున, ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి మీద ఒట్టేసి చెప్పిన రేవంత్‌రెడ్డి రుణమాఫీ పూర్తిచేయకుండా మాట తప్పారని.. ఆయన్ను క్షమించి, కష్టాల్లో ఉన్న రైతులను కాపాడాలని ఆ రామచంద్రుడ్ని వేడుకుంటున్నానని హరీశ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 10 నెలల్లో 2 వేల అత్యాచార ఘటనలు జరిగాయని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికైనా కాంగ్రెస్ బుకాయింపులు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
Updated Date - Sep 24 , 2024 | 03:39 AM