Harish Rao: కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి..
ABN , Publish Date - Oct 03 , 2024 | 04:36 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఖండించారు.
సురేఖ వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు
సురేఖ నోటిని యాసిడ్‌తో శుభ్రం చేయాలి
బీఆర్‌ఎస్ మహిళా నేతల మండిపాటు
హైదరాబాద్, శివ్వంపేట, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన కొండా సురేఖ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారంటూ దివంగత బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరేట్ థాచర్ గతంలో చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు తన పోస్టుతో జతపరిచారు. కాగా, బీఆర్‌ఎ్‌సకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కేటీఆర్‌పై కొండాసురేఖ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని బీఆర్‌ఎస్ మహిళానేతలు సత్యవతి రాథోడ్, మాలోతు కవిత, తుల ఉమ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ ఇలాగే మాట్లాడితే సురేఖను కోర్టుకు ఈడుస్తామన్నారు. ఆమె నోటిని యాసిడ్‌తో శుభ్రం చేయాలన్నారు. కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహిళా మంత్రులను అడ్డుపెట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని, హైడ్రాతో పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్‌ను కాపాడుకునేందుకు కొండాసురేఖ, సీతక్కతో మాట్లాడిస్తున్నారన్నారు. బేషరతుగా సమంత, కేటీఆర్‌లకు సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.