Hyderabad : డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణలో సినీ నటులకూ బాధ్యత
ABN, Publish Date - Jul 03 , 2024 | 04:07 AM
‘‘డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించే బాధ్యత సినీ పరిశ్రమపైనా ఉంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు.. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో .....
అవగాహన వీడియోలు ప్రదర్శిస్తేనే టికెట్ ధరల పెంపు: సీఎం
100 కిలోలకు మించి గంజాయి పట్టిస్తే 2 లక్షలు: శాండిల్య
అలా చేస్తేనే సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి
అతిపెద్ద సమస్యలు సైబర్ నేరాలు,మాదక ద్రవ్యాలే: సీఎం రేవంత్
‘డ్రగ్స్’ నష్టాలపై చిరంజీవి వీడియా భేష్ అంటూ అభినందనలు
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘‘డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించే బాధ్యత సినీ పరిశ్రమపైనా ఉంది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు ముందు.. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పలితాలపై అవగాహన కల్పించే విధంగా తారాగణంతో ఒకటిన్నర లేదా రెండు నిమిషాల నిడివితో రూపొందించిన వీడియోలనూ ప్రదర్శించాలి. ఉచితంగా ఈ వీడియోలను ప్రదర్శిస్తేనే సినిమా టికెట్ ధరల పెంపునకు, షూటింగులకు అనుమతులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 కార్లు, 54 ద్విచక్ర వాహనాలు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్)కు 27 కార్లు, 59 ద్విచక్ర వాహనాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు.
డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమా అనేది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో చేసే వ్యాపారమని, వారి వ్యాపారాన్ని తాము కాదనమని, అదంతా ప్రజల నుంచి వచ్చేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యలు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలేనని అన్నారు. ఒకప్పుడు హత్య, అత్యాచారాలు పెద్ద నేరాలుగా ఉండేవని, హత్యతో ఒకరే చనిపోతారని, కానీ డ్రగ్స్ ప్రభావంతో ఒక తరం పనికిరాకుండాపోతుందని పేర్కొన్నారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై ఇటీవల ప్రముఖ నటుడు చిరంజీవి ఓ వీడియో తీసి పంపారని, ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు సీఎం తెలిపారు.
చిరంజీవిని ఇతర నటులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై టీవీలు, పత్రికల్లోనూ అప్పుడప్పుడు ఉచితంగా ప్రకటనలు వేయాలని కోరారు. గత ప్రభుత్వ పదేళ్ల నిర్లక్ష్యంతో గంజాయి వినియోగం గల్లీగల్లీలో పెరిగిపోయిందని ఆరోపించారు. కళాశాలలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ గంజాయి అమ్మకాలు సాగుతుండటం ఆందోళనకర విషయమన్నారు. ఉన్నత వర్గాల వారే కాకుండా మధ్యతరగతి, పేద వర్గాలకు చెందిన వారు సైతం గంజాయికి బానిసలు అవుతున్నారని, ఇటీవల హత్యలు, చిన్న పిల్లలపై దాడులకు కారణమైన వారిని పరిశీలిస్తే వారిలో అత్యధికులు గంజాయికి బానిసలైనవారిననే తేలిందని చెప్పారు. ఆధునిక కాలంలో అందివచ్చిన సాంకేతికతను, నైపుణ్యాలను నేరగాళ్లు వినియోగించుకుంటున్నారని, వారిని ఎదుర్కోవాలంటే అంతకుమించిన నైపుణ్యాలు, సాంకేతికతను పోలీసులు అందిపుచ్చుకోవాలని సూచించారు.
సమర్థంగా పనిచేస్తే పదోన్నతులు
గతంలో ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరాటం చేసిన పోలీసు సిబ్బందికి పదోన్నతులు ఇచ్చేవారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరాను అరికట్టడంలో సమర్థంగా పనిచేసే పోలీసు సిబ్బందికి పదోన్నతులు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. సైబర్ నేరాగళ్లను పట్టుకున్న వారికి, సైబర్ నేరాలు జరగకుండా అడ్డుకున్న వారికి, డ్రగ్స్ సరఫరా చేసే వారిని పట్టుకునే సిబ్బందికి పదోన్నతులు కల్పించే విధివిధానాలు తయారు చేయాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. ఇందుకోసం శాసనసభలో చర్చించి అవసరమైన చట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Updated Date - Jul 03 , 2024 | 04:12 AM