Telangana Politics: తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా.. బీఆర్‌ఎస్ నేతల మాటల్లో నిజమెంత
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:08 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని.. దీంతో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు తర్వాత ..
తెలంగాణలో త్వరలోనే పది శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని.. తమ పార్టీ విజయం సాధిస్తుందంటూ సోమవారం నుంచి బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని.. దీంతో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైకోర్టు తీర్పుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామంటూనే.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా.. లేకుండా డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తారా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.
అనర్హత వేటు పడుతుందా..
హైకోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పీఏసీ ఛైర్మన్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి కారణమైంది. వాస్తవానికి పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన నాయకుడికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. అయితే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమిస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను పీఏసీ ఛైర్మన్‌గా ప్రకటించడం ద్వారా అరికెపూడి గాంధీని ఇప్పటికీ స్పీకర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ పీఏసీ ఛైర్మన్ విషయంలో అరికెపూడి గాంధీని సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తే.. మిగతా తొమ్మిదిమంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్‌ఎస్ పిటిషన్‌పై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వాళ్లను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నట్లు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా.. లేదంటే అనర్హత వేటు వేస్తారా అనేది కీలకం కానుంది. అనర్హత వేటువేస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఉప ఎన్నికలకు అవకాశం ఉండదు. హైకోర్టు తీర్పుపై స్పీకర్ లేదా.. స్పీకర్ కార్యాలయం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తుందా.. లేదంటే నాలుగు వారాల్లోపు స్పీకర్ నిర్ణయాలన్ని వెలువరిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Rain Alert: వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here
Updated Date - Sep 10 , 2024 | 11:08 AM