CM Revanth Reddy: అబద్దాల సంఘం అధ్యక్షుడు ఎక్కడ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:14 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. అవుట్‌లకు, రాజీవ్ రహదారి, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో రైతు భరోసాపై జరిగిన స్వల్పకాలిక చర్చపై ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ ప్రతిపక్ష నాయకుల వైఖరిని తప్పుపట్టారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో చేసిన పాపాలను చదవడం తనకు శిక్షగా మారిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తామని మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. అన్ని పార్టీలు, ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలు తీసుకుని రైతు భరోసా పథకం విధివిధానాలు రూపొందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. విధివిధానాలు రూపొందించి రైతు భరోసా మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు పథకంలో.. వ్యవసాయం చేసేవారికి వారికి పెట్టుబడి సహాయం అని స్పష్టంగా పేర్కొందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆశించినంత లాభం చేకూరలేదన్నారు. సాగుచేయని భూములకు రూ. 22,606 కోట్లు రైతుబంధు ద్వారా అందిందన్నారు. లే అవుట్‌లకు, రాజీవ్ రహదారి భూములకు, శ్రీశైలం హైవే, క్రషర్లు, మైనింగ్ భూములకు రైతు బంధు సహాయం అందించారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు.
దొంగ పాస్ పుస్తకాలతో రైతుబంధు..
దొంగ పాస్ పుస్తకాలతో రైతుబంధు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు సహాయం పొందారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ పెద్దల అనుచరులు, బంధువుల పేర్లతో రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని ఆరోపించారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారనుకున్నామంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. మీరు కాదు మాకు ఆదర్శం.. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేము ఇక్కడ ఉండేవారం కాదంటూ కేసీఆర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. వ్యవసాయ దారులు మాకు ఆదర్శం. బీఆర్ఎస్ చిత్ర, విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో మీ సూచనలు చెప్పండి. అబద్దాల సంఘం అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యల పై అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు ఆత్మహత్యల్లో భారతదేశం రెండో స్థానంలో..
‘‘2014లో 898 మంది, 2015లో 1358, 2016లో 632 మంది మొత్తంగా 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ రెడ్డి శాసనసభలో తెలిపారు. 2014 నుంచి16 మధ్య NCRB ప్రకారం రైతు ఆత్మహత్యల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు.