Share News

TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. సీనియర్ నేతలు ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 05:32 PM

టీసీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులున్నా.. పార్టీని అధికారంలోకి తెచ్చారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

TPCC: టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ గౌడ్.. సీనియర్ నేతలు ఏమన్నారంటే..

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నూతన అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త టీపీసీసీ చీఫ్‌కు మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండాను అందజేశారు. దీంతో ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్లల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా మహేశ్ కుమార్ గౌడ్ నిలిచారు.


గాంధీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరయ్యారు. ముందుగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని మహేశ్ గౌడ్ నివాళులు అర్పించారు. అక్కడ్నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, కార్యకర్తలతో కలిసి ఆయన భారీ ర్యాలీగా గాంధీ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ తన ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టడంపై ఏఐసీసీ సెక్రటరీ జనరల్ దీపాదాస్ మున్షి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దీపాదాస్ మాట్లాడుతూ.."మహేశ్ గౌడ్ టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. పార్టీలో ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. కష్టపడ్డ కార్యకర్తలను గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది" అని చెప్పారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. మహేశ్ గౌడ్‌కు అధిష్ఠానం గురతర బాధ్యత అప్పగించిందని.. కొత్త, పాత వారిని కలుపుకుని ఆయన పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణకు ఓబీసీ నాయకత్వం రావడం చాలా సంతోషంగా ఉందని హనుమంతరావు చెప్పుకొచ్చారు.


టీసీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులున్నా.. పార్టీని అధికారంలోకి తెచ్చారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి నియోజకవర్గానికీ 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని భట్టి చెప్పారు. కాంగ్రెస్ కోసం పని చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనాదిగా పనిచేస్తున్న వారికి పదవులు ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్దామని భట్టి పిలుపునిచ్చారు.


సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఏఐసీసీ మరోసారి నిరూపించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల్లో ఒకే కుటుంబ నాయకత్వం ఉంటుందని, కానీ కాంగ్రెస్‌లో అలా ఉండదని ఉత్తమ్ చెప్పారు. త్యాగం చేసిన వారిని పార్టీ ఎప్పుడూ మరిచిపోదని చెప్పారు. దేశంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతోందని, రాహుల్ గ్రాఫ్ పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి, నిజాం రాజ్యం విలీనానికి, తెలంగాణకు బీజేపీకి సంబంధమే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

Crime News: మహిళపై అత్యాచారం... రేపిస్టును ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్..

CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

Updated Date - Sep 15 , 2024 | 05:36 PM