Hyderabad:వారంలోగా మ్యాప్‌లు సమర్పించాలి.. హైడ్రా కమషనర్ ఏవీ రంగనాథ్..
ABN, Publish Date - Dec 23 , 2024 | 07:22 PM
ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్‌ఆర్) ఆనుకుని ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ క్రమంలో నానక్‌రామ్‌గూడకు చేరువలోని వివిధ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని..
హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది హైడ్రా. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువుతున్నాయి. వాటి ఆధారంగా ఎక్కడెక్కడ చెరువుల ఆక్రమణకు గురయ్యాయో పరిశీలిస్తోంది హైడ్రా బృందం. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డుకు (ఓఆర్‌ఆర్) ఆనుకుని ఉన్న పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చెరువుల ఆక్రమణతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా విచారించారు.
హైదరాబాద్: ఓఆర్‌ఆర్ సమీపంలో పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చెరువులలో మట్టిపోయడం, వరద కాలువలు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టడం, తౌతాని కుంట, భగీరథమ్మ చెరువుకు వెళ్లే కాలువ లింకు తెగటంతో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేయడంతో తనిఖీ చేపట్టారు. నానక్‌రామ్‌గూడకు సమీపంలోని తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగిలోని నెక్నాంపూర్ చెరువులు ఆక్రమణకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా చెరువుల్లోకి వరద నీరు చేరకుండా కాలువలను మళ్లించడం, మూసివేయడంపై విచారణకు ఆదేశించారు.
చెరువులను పరిశీలించేందుకు వచ్చిన హైడ్రా కమిషనర్‌కు పలువులు స్థానికులు తమ సమస్యలు వినిపించారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఖాళీస్థలం నుంచి వర్షపు నీరు వెళ్లే రహదారులు మూసుకుపోవడంతో సమీపంలో ఉన్న అపార్టుమెంట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వరదనీరు తౌతాని కుంట ద్వారా భగీరథమ్మ చెరువుకు చేరేలా చేసి ఇబ్బంది తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు చెరువులకు ఆనుకుని ఉన్న తమ స్థలాలను కాపాడాలని కోరగా.. పూర్తి వివరాలు హైడ్రాకు సమర్పిస్తే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
నానక్‌రామ్‌గూడకు సమీపంలోని వరదనీటి కాలువలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, దుకాణాలు వెంటనే తొలగించాలని ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్), హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ) అధికారులను సంప్రదించి సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పారు. గ్రామీణ మ్యాప్‌లతో పాటు.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ విభాగాలకు చెందిన మ్యాప్‌లతో పూర్తి స్థాయి పరిశీలన జరిపించి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Dec 23 , 2024 | 07:26 PM