Share News

HYDRA: ఎన్ కన్వెన్షన్ చరిత్ర, వివాదం ఇదే..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 07:27 PM

హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడీ పేరు ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడ చూసినా మార్మోగుతోంది..! అటు పొలిటికల్.. ఇటు సినీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది..! ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి..!

HYDRA: ఎన్ కన్వెన్షన్ చరిత్ర, వివాదం ఇదే..!

హైడ్రా.. హైడ్రా.. ఇప్పుడీ పేరు ఒక్క హైదరాబాద్‌లోనే ఎక్కడ చూసినా మార్మోగుతోంది..! అటు పొలిటికల్.. ఇటు సినీ సర్కిల్స్‌ను షేక్ చేస్తోంది..! ఈ పేరు వింటేనే హడలెత్తిపోయే పరిస్థితి..! శనివారం నాడు టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేయడంతో ఎక్కడ చూసినా.. ఎవరినోట విన్నా హైడ్రా పేరే వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! ఇంతకీ.. ఎన్ కన్వెన్షన్‌ ఎందుకు కూల్చాల్సి వచ్చింది..? దీని వెనుక వివాదం ఏంటి..? ఆ కథా కహానీ ఏంటో తెలుసుకుందాం వచ్చేయండి..!

ఎందుకు.. ఏమైంది?

తమ్మిడికుంటలోని 3 ఎకరాల స్థలాన్ని నిబంధనలు అతిక్రమించి ఆక్రమించారని ఆరోపిస్తూ.. హైడ్రా అధికారులు నాగార్జున (Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను (మాదాపూర్‌) నేలమట్టం చేయడం జరిగింది. దీంతో ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక సైతం ఇందులోనే జరగడం గమనార్హం.


N-Convention-3.jpg

తుమ్మడికుంట వివరాలు..

అధికారిక రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం తుమ్మడికుంట జలాశయం 29 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఎన్ కన్వెన్షన్ ప్రధాన కట్టడాన్ని 2010లో నిర్మించారు. మొత్తంగా 10 ఎకరాల్లో ఉన్న ఈ ఫంక్షన్ హాల్‌కి సంబంధించి 3 ఎకరాల 10 గుంటలను కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ. ఎన్ కన్వెన్షన్ అధికారిక సమాచారం ప్రకారం.. ఈ కన్వెన్షన్ అక్కినేని నాగార్జునతోపాటు, నల్లా ప్రీతమ్ రెడ్డి పేర్ల మీద ఉంది. ఎన్ 3 ఎంటర్‌ప్రైసెస్ పేరుతో దీన్ని నడుపుతున్నారు.

హైదరాబాద్‌లో చిన్న స్థాయి వీఐపీ నుంచి బడాబడా వ్యక్తుల వరకు ఎవరింట్లో వేడుక జరిగినా అది ఎన్ కన్వెన్షలోనే. ఈ ఫంక్షన్ హాల్ ద్వారా ఇప్పటి వరకు నాగార్జున కొన్ని కోట్లల్లో సంపాదించారని తెలుస్తోంది. N కన్వెన్షన్.. తుమ్మడికుంట చెరువు FTLకు 25 మీటర్లలోనే కట్టారనేది ఆరోపణ. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి.


N-Convention-Hall.jpg

తుమ్మడికుంట చెరువు ఆక్రమణలో రెండు పెద్ద హాల్స్, ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. పెద్ద పెద్ద సెట్టింగులు వేసేందుకు, విలాసవంతంగా ఫంక్షన్‌లు చేసేందుకు తగినట్లు ఎన్-కన్వెన్షన్‌ను రూపొందించారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్ కన్వెన్షన్‌పై భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి.. సర్వే నిర్వహించారు. గతంలోనే ప్రభుత్వం ఈ అంశంపై నాగార్జునకు నోటీసులు పంపింది.


AV-Ranganath.jpg

నాగార్జున కోర్టును ఆశ్రయించగా.. రూ.9 కోట్లు డిపాజిట్‌గా కట్టి.. ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే కన్వెన్షన్ నిర్మాణంలో తగిన మార్పులు చేస్తామని హైకోర్టుకు చెప్పారు. కాగా కోర్టు స్టే నడుస్తుండగానే అక్రమ నిర్మాణమంటూ కూల్చేయడంపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టు తలుపుతట్టారు. కూల్చివేతలు పూర్తవుతున్న క్రమంలో కోర్టు ఇవాళ స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే కన్వెన్షన్ అక్రమ కట్టడమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కాబట్టే తాము చర్యలు తీసుకున్నామని తేల్చి చెప్పారు. నాగార్జునకు ఉన్న మొత్తం ఆస్తుల్లో ఎన్ కన్వెన్షన్‌ కేవలం 10 శాతం మాత్రమేనని తెలుస్తోంది. ఎన్ కన్వెన్షన్‌తోపాటు కుంటకు అన్నివైపులనున్న కట్టడాలను సైతం హైడ్రా కూల్చేసింది.

n-convention.jpg

Updated Date - Aug 24 , 2024 | 08:17 PM