TS Politics:అందుకోసమే హరీశ్ దగ్గర ఐదువేల కోట్లు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
ABN, First Publish Date - 2024-02-10T19:23:53+05:30
మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎతులు, అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) ఆరోపించారు.
హైదరాబాద్: మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎతులు, అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) ఆరోపించారు. శనివారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడేనని విమర్శించారు. హరీష్ రావు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదన్నారు. 2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్లు దాచి పెట్టినట్టు సమాచారం ఉందన్నారు. హరీష్ రావు ముఖ్యమంత్రి కావడానికి రూ.5000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసి దాచి పెట్టాడని విమర్శించారు. రూ.5000 కోట్లు హరీష్ రావు ఎక్కడ దాచిపెట్టాడో బయటపెట్టాలని సీఎం రేవంత్‌కి లేఖ రాస్తానని తెలిపారు. ENC హరిరామ్ దగ్గర హరీష్ రావు డబ్బులు ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పెట్టడంతో మేడారంలో భక్తుల సంఖ్య పెరిగిందని తెలిపారు.
వారిపై ఈడీ దాడులు జరగవు..
రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక హరీష్ రావుకు ఏడాది దాకా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతామని.. ఇది ఆరంభం మాత్రమేనని తేల్చిచెప్పారు. హరీష్ రావు రూ.5వేల కోట్లు, కవిత, సంతోష్ కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం డబ్బులు బ్లాక్ చేయడం వల్ల మార్కెట్లో డబ్బులు కనిపించడమే లేదని సెటైర్లు వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్మును మాజీ సీఎం కేసీఆర్ వెనకేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ప్రజల వద్దకే చేరుతుందన్నారు. కేసీఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ దాడులు జరగవని చెప్పారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ దగ్గరనే చెప్పులు ఉన్నాయా... కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర చెప్పులు లేవా? అని ప్రశ్నించారు. సుమన్‌కు అంత అతి ఉత్సాహం ఎందుకు? అని జగ్గారెడ్డి నిలదీశారు.
Updated Date - 2024-02-10T20:11:39+05:30 IST