Jeevan Reddy: భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.. జీవన్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 24 , 2024 | 09:35 PM
జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.
జగిత్యాల జిల్లా: జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయం స్థానిక నేత జీవన్ రెడ్డికి (Jeevan Reddy) కనీస సమాచారాన్ని అధిష్ఠానం ఇవ్వకపోవడంతో ఆయన వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. అదీకాక జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం అలర్ట్ అయింది.
ఇందులో భాగంగానే జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి మాట్లాడారు. అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డిని శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఓదార్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతో జీవన్ రెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉదయం నుంచి జీవన్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా కార్యకర్తల మోహరించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని కార్యకర్తలతో జీవన్ రెడ్డి అన్నారు.
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి అధిష్ఠానం దిగింది. పార్టీలో గౌరవం తగ్గకుండా చూస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. తనకు తెలియకుండా సంజయ్ కుమార్‌ను ఎలా చేర్చుకున్నారని శ్రీధర్ బాబును జీవన్ రెడ్డి అడిగారు. సంజయ్‌కు వ్యతిరేకంగా జీవన్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
శ్రీధర్ బాబుతో చర్చించా: జీవన్ రెడ్డి
జరిగిన పరిణామాలపై శ్రీధర్ బాబుతో చర్చించానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ప్రభుత్వానికి అండగా ఉండేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుందని జీవన్‌రెడ్డి అన్నారు.
జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు పెద్దదిక్కు: మంత్రి శ్రీధర్ బాబు
జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు పెద్దదిక్కని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జీవన్ రెడ్డి మనోభావాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. చేరికల విషయంలో సమన్వయ లోపం జరిగిందని చెప్పారు. పార్టీని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. జీవన్ రెడ్డి గౌరవానికి ఇబ్బంది కలగకుండా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
Updated Date - Jun 24 , 2024 | 10:09 PM