KTR: కోతల.. ఎగవేతల బడ్జెట్ ఇది.. ప్రభుత్వంపై కేటీఆర్ విసుర్లు
ABN, Publish Date - Jul 25 , 2024 | 08:58 PM
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్‌పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. కేసీఆర్ ప్రభుత్వంపై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పలు విషయాలపై ట్విట్టర్(X) వేదికగా కౌంటర్ ఇచ్చారు.
బడ్జెట్‌లో హామీలను గాలికొదిలేశారు..
‘‘ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు..! గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల..ఎగవేతల బడ్జెట్..! వాగ్దానాలను గాలికొదిలిన..వంచనల బడ్జెట్..! డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసిన...దోకేబాజ్ బడ్జెట్..! విధానం లేదు..విషయం లేదు..విజన్ లేదు..పేర్ల మార్పులతో ఏమార్చిన డొల్ల బడ్జెట్..! రైతులకు కత్తిరింపులు, అన్నదాతలకు సున్నం..! ఆడబిడ్డలకు అన్యాయం..మహాలక్ష్ములకు మహామోసం..! అవ్వాతాతలకు..దివ్యాంగులకు.. నిరుపేదలకు...నిస్సహాయులకు మొండిచేయి..! పెన్షన్ల పెంపు మాటెత్తలేదు..! దళితులకు దగా..గిరిజనులకు మోసం. అంబేద్కర్ అభయహస్తం ఊసులేదు..శూన్యహస్తమే మిగిలింది..! బడుగు..బలహీన వర్గాలకు భరోసాలేదు..వృత్తి కులాలపై కత్తికట్టారు..! మైనార్టీలకు ఇచ్చిన మాటలన్నీ..నీటి మూటలైనయ్..! నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..4 వేల భృతి జాడా లేదు..! విద్యార్థులపై కూడా వివక్షే.. రూ.5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు..! హైదరాబాద్ అభివృధిపై శ్రద్ధలేదు..మహానగర మౌలిక వసతులకు నిధుల్లేవ్..! నేతన్నకు చేయూత లేదు..ఆటో అన్నలను అండదండ లేదు.. ఆత్మహత్యపాలైన కుటుంబాలకు ఆదుకోవాలన్న మానవీయ కోణమేలేదు..! మొత్తంగా పసలేని దిశలేని దండగమారి బడ్జెట్..! ఇది’’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
మరోవైపు.. తెలంగాణ బడ్జెట్ 2024-25పై(Telangana Budget 2024) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అందరినీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.
కొత్త నాటకానికి తెరలేపారు
"ఇది రైతు శత్రు ప్రభుత్వం. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదు. గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు, రైతు భరోసా తదితర పథకాలకు కేటాయింపులే లేవు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. కథ చెప్పినట్లే ఉంది తప్పా.. బడ్జెట్ పెట్టినట్లు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయమివ్వాలని 6 నెలలపాటు అసెంబ్లీకి రాలేదు.రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదు. ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదు. మహిళలకూ ఇచ్చిందేమి లేదు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరడతారు. కాంగ్రెస్ మోసపూరిత ఎన్నికల వాగ్ధానాలు అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Updated Date - Jul 25 , 2024 | 08:59 PM