Sridhar Babu: నేను అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 02 , 2024 | 10:43 PM
మా నాన్న (శ్రీపాద రావు) ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: మా నాన్న (శ్రీపాద రావు) ఆశయాలను నెరవేర్చేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తెలిపారు. శ్రీపాద రావు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి స్ఫూర్తిదాయకమైన దివంగత ప్రధానమంత్రి పీవి నర్సింహరావుకు ప్రధాన శిష్యుడుగా మా తండ్రి ఉన్నారని తెలిపారు. ప్రజల కోసం సేవ చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు: మంత్రి పొన్నం ప్రభాకర్
గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీపాద రావు ప్రజలకు ఎంతో సేవ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. శ్రీపాదరావు శిష్యులతో కలిసి తాను విద్యార్థి నాయకుడిగా ఎదిగానని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మచ్చలేని నాయకుడిగా ఆయన ఉన్నారని అన్నారు. అలాంటి నాయకుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శ్రీపాద రావుకు జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
శ్రీపాద రావు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
శ్రీపాద రావుతో చట్ట సభల్లో పాల్గొన్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) గుర్తుచేసుకున్నారు. ఆయన కుమారుడు మంత్రి శ్రీధర్ బాబుతో కూడా చట్టసభల్లో పాల్గొంటున్నానని తెలిపారు. ఇద్దరితో చట్టసభల్లో పాల్గొన్న ఏకైక వ్యక్తిని తానని అన్నారు. ఆయన అజాత శత్రువు అని కొనియాడారు. ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి శ్రీపాద రావు అని తెలిపారు. పేద ప్రజల పక్షపాతి శ్రీపాద రావు అని చెప్పారు. తీవ్ర వాదుల ప్రభావం ఉన్న మంథని ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్న వ్యక్తి శ్రీపాద రావు కొడుకు శ్రీధర్ బాబు అని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడు శ్రీధర్ బాబు అని వ్యాఖ్యానించారు. తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. శ్రీపాద రావు విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.