Hyderabad: అశ్లీల వీడియోలు చూస్తే ఇకపై జైలుకే.. అలాంటి వారిపై కన్నేసిన నిఘా సంస్థలు..
ABN, Publish Date - Oct 01 , 2024 | 05:10 PM
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా అశ్లీల దృశ్యాలు చూసే వారి సంఖ్య పెరిగిపోతోంది. సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి రావడంతో పోర్నోగ్రఫీ చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే అలాంటి వారిపై అంతర్జాతీయ, జాతీయ దర్యాప్తు సంస్థలు కన్నేశాయి. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారిని సాంకేతిక సహాయంతో పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశాయి. అలాంటి వీడియోలు చూస్తూ చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం అయ్యాయి.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి నీచపు వీడియోలకు బానిసైన వ్యక్తి తన 13ఏళ్ల కుమార్తెకు వాటిని చూపించి తనతో అలా చేయాలంటూ ఒత్తిడి చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే ఇంట్లో చెప్తుందేమో అనే భయంతో సొంత కుమార్తెనే హత్య చేశాడు. చదువుకోవడం లేదని తిట్టడం వల్లే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమ సైల్లో విచారణ చేయగా నిజం ఒప్పుకుని కటకటాల పాలయ్యాడు. ఈ ఒక్క కేసుతోనే సమాజంలో వీటి ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా కేసుల్లో దోషులుగా తేలితే ఐదేళ్ల వరకూ కఠిన శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే నేరాలు జరగక ముందే ఇలాంటి వీడియోలు చూసే వారిపై నిఘా పెట్టారు.
చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలు చిత్రీకరించినా, డౌన్‌లోడ్ చేసి చూసినా, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో వ్యాప్తి చేసినా ఇకపై కటకటాలు లెక్కించాల్సిందే. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తమను ఎవరూ గమనించడం లేదులే అని ఫోన్, కంప్యూటర్‌లో గుట్టుగా చూసినా సరే సాంకేతిక ఆధారాలతో కనిపెడుతున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసిన వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నట్లు కమిషనర్ హెచ్చరించారు.
ఈ విషయంలో విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా భారతదేశానికి సహాయ పడుతున్నాయని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తి చేస్తున్న వారిపై విదేశీ దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టినట్లు ఆయన వెల్లడించారు. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్(హెచ్‌ఎస్‌ఐ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్స్(ఎన్‌సీఎంఈసీ) వంటి సంస్థలు మెుబైల్, ల్యాప్ ట్యాప్, డెస్క్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ఐపీ అడ్రస్‌లను కేంద్ర హోంశాఖకు అందిస్తున్నాయని తెలిపారు. ఎవరైతే అశ్లీల చిత్రాలు చూస్తారో వారికి సంబంధించిన పక్కా సమాచారంతో అరెస్టు చేస్తున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. గతేడాది ఇదే విధంగా ఓ యువకుణ్ని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎవరైనా అశ్లీల దృశ్యాలు చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్.. మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు పెడితే..
Hydra: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ
Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 01 , 2024 | 05:11 PM