High Court: ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే!
ABN , Publish Date - Oct 17 , 2024 | 02:56 AM
క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ అయితే ఏంటి? ఏపీ అయితే ఏంటి?
ముందు రిపోర్ట్ చేయండి.. తర్వాత విచారిస్తాం
ఐఏఎస్ అధికారులు అయితే.. స్టే ఇవ్వాలా?
ప్రతిసారీ జోక్యం చేసుకుంటే పాలనకు ఇబ్బంది
మీరు ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి
ఏడుగురు ఐఏఎస్‌లకు స్పష్టం చేసిన హైకోర్టు
డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
స్టే కోసం ఐఏఎస్ అధికారుల పట్టు
పిటిషన్లను కొట్టివేసిన న్యాయస్థానం
ఆంధ్రప్రదేశ్‌కు వాకాటి కరుణ,
ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్
తెలంగాణకు సృజన, శివశంకర్, హరికిరణ్
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): క్యాడర్ వివాదంలో ఉన్న ఐఏఎస్ అధికారులకు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 16న ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు రిపోర్ట్ చేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏడుగురు ఐఏఎస్ అధికారులు హైకోర్టులో బుధవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం అంగీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత పిటిషన్లను విచారణకు స్వీకరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎ్‌సలు అయినంత మాత్రాన స్టే ఇవ్వాలా? అని ప్రశ్నించింది.
వాణీప్రసాద్, వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రోస్ (తెలంగాణ), జి.సృజన, లోతేటి శివశంకర్, సి.హరికిరణ్ (ఏపీ) ఎవరి రాష్ట్రాల్లో వారు రిపోర్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. క్యాట్‌లో నవంబరు 4న విచారణ ఉన్న నేపథ్యంలో అప్పటివరకైనా రిలీవ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, వి.మల్లిక్, కేఆర్‌కేవీ ప్రసాద్, లక్ష్మీనర్సింహ తదితరులు వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలను వ్యక్తిగతంగా విని స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఇదే ధర్మాసనం డీవోపీటీకి ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు.
పిటిషనర్లకు ఆ అవకాశం ఇవ్వకుండా, ఏకసభ్య కమిటీ రిపోర్ట్ అందజేయకుండా, ఏకపక్షంగా డీవోపీటీ ఈ నెల 16న వారివారి రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం చెల్లదని పేర్కొన్నారు. ‘సోమేశ్‌కుమార్’ తీర్పునకు పిటిషనర్ల కేసులకు సంబంధం లేదన్నారు. ఆయా అధికారుల సేవలు తామే వినియోగించుకుంటామని.. వారిని రిలీవ్ చేయడానికి 15 రోజుల సమయం కావాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇచ్చిన లేఖలను ధర్మాసనానికి సమర్పించారు. డీవోపీటీ ఉత్తర్వులపై క్యాట్ స్టే ఇవ్వకుండా నవంబరు 4కు వాయిదా వేసిందని..అప్పటివరకైనా రిలీవ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చి హైకోర్టే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. ఏకసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను మూడు నెలలపాటు పెండింగ్‌లో ఉంచి ప్రస్తుతం ఆకస్మికంగా డీవోపీటీ నిర్ణయం తీసుకోవడంలో అర్థం లేదని తెలిపారు. డీవోపీటీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులను కేటాయించే పని కోర్టుది కాదని, కేంద్రం నిర్ణయమే అంతిమమని పేర్కొంటున్న ‘సోమేశ్‌కుమార్’ తీర్పు దీనికి ఆధారంగా ఉందని గుర్తుచేశారు. ముందు పిటిషనర్లు ఎక్కడివారు అక్కడ రిపోర్ట్ చేయాలని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లేఖలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ‘‘ముందు ఎక్కడివారు అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయండి. ఆ తర్వాత పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. ఇప్పుడు పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే అధికారులను ఉంచాలని.. రిలీవింగ్‌కు కొంత సమయం ఇవ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు ఇచ్చాయి.
వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇస్తాం. ఆ తర్వాతైనా పరస్పర డిప్యుటేషన్ కోరుకోవచ్చు. స్టే ఇచ్చుకుంటూ పోతే ఈ వివాదనికి అంతు ఉండదు. ఇప్పుడు క్యాట్ స్టే ఇవ్వలేదని హైకోర్టుకు వచ్చారు. ఆ తర్వాత క్యాట్ ఇచ్చే తుది తీర్పుపై మళ్లీ వస్తారు. ఇలా పొడిగించుకుంటూ పోతే ఎలా? సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు సైతం విలువ ఉండాలి. వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తాం. ఐఏఎ్‌సలు అయినంత మాత్రాన.. అడిగిన వెంటనే స్టే ఇవ్వాలా? ఐఏఎ్‌సలైనా, ప్రభుత్వ ఉద్యోగులనైనా కోర్టులు కేటాయించలేవు. అక్రమంగా, అన్యాయంగా కేటాయింపులు చేసినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోగలం. ఐఏఎస్ పోస్టులు కేంద్రం పరిధిలో ఉంటాయి. చట్టప్రకారం కేంద్రమే కేటాయింపులు చేపడుతుంది.
ప్రతిసారి జోక్యం చేసుకుంటే పరిపాలనకు ఇబ్బందులు కలుగుతాయి. మీరున్నది ప్రజల కోసం. వారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు పెద్ద అధికారులని అడిగినప్పుడల్లా స్టే ఇవ్వలేం. ఏపీ అయితే ఏంటి? తెలంగాణ అయితే ఏంటి? ఎక్కడైనా పని చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించింది. అధికారులు ఎక్కడివారు అక్కడ రిపోర్ట్ చేస్తే పిటిషన్లు పెండింగ్‌లో ఉంచడానికి ధర్మాసనం మొగ్గుచూపింది. పిటిషనర్లు మధ్యంతర ఉత్తర్వుల కోసం పట్టుబట్టడంతో వాదనలను రికార్డు చేసిన ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం చేసిన కేటాయింపుల్లో జోక్యం చేసుకోలేమని, అనవసర జోక్యం వల్ల పరిపాలనకు ఇబ్బందులు వస్తాయని తీర్పులో స్పష్టంచేసింది.