KTR: మోసపోతే గోస పడతారని చెప్పాం..
ABN, Publish Date - May 25 , 2024 | 04:51 AM
‘‘మోసపోతే గోస పడతారని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినప్పటికీ వినలేదు. కాంగ్రె్‌సనే గెలిపించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా హత్యా రాజకీయాలు చేస్తోంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
అయినా మార్పు కావాలని కాంగ్రె్‌సను గెలిపించారు
హత్యా రాజకీయాలకు తెరతీసిన రేవంత్ సర్కార్
ఉచిత బస్సు హామీ తప్ప ఇంకేమీ చేయలేదు: కేటీఆర్
యాదాద్రి/దేవరకొండ/నకిరేకల్/హైదరాబాద్, మే 24(ఆంధ్రజ్యోతి): ‘‘మోసపోతే గోస పడతారని, కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినప్పటికీ వినలేదు. కాంగ్రె్‌సనే గెలిపించారు. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా హత్యా రాజకీయాలు చేస్తోంది’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెరలో, నల్లగొండ జిల్లా దేవరకొండ, నకిరేకల్‌లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి అన్ని గ్రామాలు, తండాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించిందన్నారు. ఉచిత బస్సు హామీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రె్‌సకు మొదటి హెచ్చరిక జారీ చేసేదే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితమని అన్నారు. ఈ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పోదని, కానీ ప్రశ్నించే గొంతును గెలిపించాలని కోరారు. పదేళ్ల నిజం, ఆరు నెలల అబద్ధం మీ ముందు ఉన్నాయని, పట్టభద్రులు ఆలోచన చేయాలన్నారు. తనపై 54 క్రిమినల్ కేసులు ఉన్నాయని తీన్మార్ మల్లన్నే ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గోల్డ్ మెడలిస్ట్ అని, కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ అని కేటీఆర్ అన్నారు.
ఆర్టీసీ ఎండీని కోర్టుకు లాగుతాం
అధికారంలో ఉన్న వారి మాటలు విని వేధిస్తే కోర్టుకు లాగుతామని డీజీపీ రవిగుప్తా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లను కేటీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ కొత్తలోగో ప్రచారం విషయంలో బీఆర్‌ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడం పట్ల శుక్రవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ఆర్టీసీ కొత్తలోగో అంటూ ప్రచారం చేసిన ఎన్టీవీ, బిగ్‌టీవీ చానెళ్లు, వెలుగు దినపత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారు.. మరి నకిలీవార్తలు ప్రచారం చేస్తున్న సీఎంను జైల్లో ఎందుకు పెట్టరని పోలీసులను ప్రశ్నించారు.
Updated Date - May 25 , 2024 | 04:51 AM