Hanumakonda: పిడుగుపాటుకు ఇద్దరి మృతి
ABN , Publish Date - Oct 07 , 2024 | 04:36 AM
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురువగా.. పిడుగుపాటు వల్ల హనుమకొండ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు.
హనుమకొండ జిల్లాలోని ఓ పత్తి చేనులో దుర్ఘటన .. ఇంటర్ విద్యార్థిని, యువ రైతు మరణం
ఐనవోలు/నెల్లికుదురు/హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురువగా.. పిడుగుపాటు వల్ల హనుమకొండ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురానికి చెందిన కుకట్ల రాజుయాదవ్ (25) దౌతుబాజి శ్రావణి(17), కుకట్ల కోమల(రాజుయాదవ్ తల్లి) సహా ఏడుగురు కలిసి గ్రామ శివారులోని పత్తి చేనులో పత్తి ఏరుతున్నారు. అయితే, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భారీ వర్షం పడడంతో అందరూ సమీపంలోని ఓ రేకుల షెడ్డు కిందకి వెళ్లారు. పది నిమిషాల వ్యవధిలో ఆ షెడ్డుపై పిడుగుపడగా అంతా స్పృహ కోల్పోయారు.
కాసేపటికి తేరుకున్న కొందరు ఇతరులను లేపేందుకు ప్రయత్నించగా రాజుయాదవ్, శ్రావణి ప్రాణాలు కోల్పోయారు. రాజుయాదవ్ తల్లి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రావణి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. యువ రైతు అయిన రాజు అవివాహితుడు. ఇక, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు కార్యాలయంలో ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆర్.సింగారం సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. సింగారం స్వస్థలం తమిళనాడులోని వెల్లూరు.. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పతిల్రో చికిత్స పొందుతున్న సింగారం పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
నేడు, రేపు వర్షాలు..
రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, జనగాం, వరంగల్, యాదాద్రి జిల్లాలకు సోమవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, ఆదివారం జనగామలో 3 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా, .భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.