Lok Sabha Elections: పోరు.. ఇక జోరు.. నేటినుంచి నామినేషన్లు
ABN , Publish Date - Apr 18 , 2024 | 08:33 AM
పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) పోరు ఇక జోరందుకోనుంది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసిన వారు పొరపాట్లున్నాయన్నది గుర్తించేందుకు న్యాయవాదులు, సీనియర్ నేతల పరిశీలనకు ఇచ్చారు.
హైదరాబాద్ సిటీ: పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) పోరు ఇక జోరందుకోనుంది. నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసిన వారు పొరపాట్లున్నాయన్నది గుర్తించేందుకు న్యాయవాదులు, సీనియర్ నేతల పరిశీలనకు ఇచ్చారు. 25వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉండగా, సెలవు దినమైన ఆదివారం నామినేషన్ వేసే అవకాశం లేదు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. మంచి రోజు చూసుకొని అభ్యర్థులు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. 19వ తేదీన సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి(Secunderabad BJP candidate Kishan Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ 22 24వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీ-ఫారంలు ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావుగౌడ్ 19వ తేదీన లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి ఓ సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. మరో రోజు ర్యాలీగా నామినేషన్ దాఖలుకు వెళ్తామని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యే అవకాశముంది.
ఇదికూడా చవండి: 3 నెలల్లో బీఆర్‌ఎస్‌ను బొంద పెడతాం
ఎక్కడికక్కడే ప్రచారం..
మూడు నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార ప్రణాళికలను వివరిస్తున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యే/పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో, డివిజన్‌లో కార్పొరేటర్లు/మాజీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో ప్రచారం నిర్వహించాలని కోరుతున్నారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలోని పలు నియోజకవర్గా ల్లో బీజేపీ నేతల ప్రచారం షురూ అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్, పట్నం సునీతా రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు పద్మారావు, రాగిడి లక్ష్మారెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్‌లు పాదయాత్రలు నిర్వహించడంతోపాటు వాకర్లు, ఇతర సంఘాల నేతలను కలుస్తున్నారు.
ఇదికూడా చదవండి: సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం