Madiga Reservation: ధర్మమే గెలిచింది..
ABN, Publish Date - Aug 02 , 2024 | 03:48 AM
ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
30 ఏళ్ల ఉద్యమంలో అమరులైన మాదిగ బిడ్డలకు అంకితం
వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దు
చంద్రబాబు చేసిన చట్టాన్నే అత్యున్నత కోర్టు సమర్థించింది..
త్వరలోనే ఒకే వేదికపై విజయోత్సవ సభ
‘ఆంధ్రజ్యోతి’తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ
న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఏపీ, తెలంగాణలో వర్గీకరణను వెంటనే చేపడతారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేదాక ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని కోరారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లను అవసరం మేరకు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. తీర్పు తర్వాత సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చిన మందకృష్ణ ఉద్వేగంతో కంటతడి పెట్టారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మందకృష్ణ మాట్లాడారు. ‘‘న్యాయం, ధర్మం కోసం చేసిన పోరాటం గెలిచింది. 29 ఏళ్ల వయసులో ఉద్యమం ప్రారంభించా. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు 30 ఏళ్లు ఎంతో తపించాం. మమ్మల్ని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. పలుకుబడి ఉన్న స్వార్థపరులు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారు. అయినా, మేం సహనం కోల్పోలేదు. ఇవాళ విజయం సాధించాం. పోరాటంలో ప్రాణాలొదిలిన మాదిగ బిడ్డలకు దీనిని అంకితం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉండగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు అని మంద కృష్ణ గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనివార్యం
ఎస్సీ వర్గీకరణను తెలంగాణలో అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనివార్యమని మంద కృష్ణ తెలిపారు. ‘’వర్గీకరణకు అనుకూలమని, సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు అనేకసార్లు చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిని ఏర్పాటు చేశామని తెలిపారు. కర్ణాటకలోనూ వర్గీకరణ అమలు చేస్తారనే నమ్మకం ఉంది. దేశంలో రిజర్వేషన్ల చట్టం రెండో అడుగు వేయబోతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉంది. కొన్ని కులాలకే రిజర్వేషన్లు మళ్లీమళ్లీ దక్కాయి. ఇకపై మాత్రం ఆ ఫలాలు అన్ని వర్గాలు, వ్యక్తులు, కుటుంబాలకు అందుతాయి. రాజ్యాంగంలో అంబేడ్కర్ రిజర్వేషన్లు పొందుపరిచారు. వాటిని ముందుకు నడిపే ప్రక్రియను ఎమ్మార్పీఎస్ భుజానికెత్తుకుంది’’ అని అన్నారు. పదేళ్లకోసారి ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ప్రభుత్వాల దగ్గర సిద్ధంగా ఉంటాయని.. కొత్తగా లెక్కలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తక్షణమే రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పుడు అమలు చేయకుంటే సుప్రీం కోర్టు తీర్పునకు అన్యాయం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. ఒకటి, రెండ్రోజులు ఢిల్లీలోనే ఉండి పెద్దలను కలిసి కృతజ్ఞతలు చెబుతానని మంద కృష్ణ వివరించారు. ‘‘హైదరాబాద్ వెళ్లాక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తేదీని ప్రకటించి విజయోత్సవ సభ, సహకరించిన వారికి అభినందన సభ నిర్వహిస్తాం. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను హైదరాబాద్‌కు తీసుకురావడంలో, వర్గీకరణను మందుకు తీసుకెళ్లడానికి కమిటీ ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎంతో చొరవ చూపారు. వారందరినీ కలుస్తా. విజయోత్సవ, అభినందన సభలకు రావాలని కోరుతా’’ అని మందకృష్ణ తెలిపారు.
ఇది ఒకరి గెలుపు కాదు.. ఒకరి ఓటమి కాదు..
ఇది ఒకరి గెలుపు కాదు.. ఒకరి ఓటమి కాదని, సోదర వర్గమైన మాలలు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, అడ్డంకులు సృష్టించొద్దని మంద కృష్ణ విజ్ఞప్తి చేశారు. ‘‘న్యాయమైన వాటా కోసమే తప్ప రిజర్వేషన్ ఫలాలన్నీ మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలేదు. మాదిగల కంటే వెనకబడిన ఉప కులాలు ఉంటే వారి వాటా వారికి అందాలి. ఎక్కడ ఏ వర్గానికి, ఏ తెగకు అన్యాయం జరిగినా అక్కడ వర్గీకరణ అమలు చేయవచ్చన్న కోణంలో సుప్రీం కోర్టు తీర్పుని మనం చూడాలి’’ అని మందకృష్ణ తెలిపారు. ‘‘2004లో వర్గీకరణను రద్దు చేయకపోతే మన ఉద్యమాలు మరోలా ఉండేవి. 20 ఏళ్లలో ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేసేవాళ్లం.
దళిత, గిరిజన, బహుజన వర్గాల హక్కులను సాధించేవాళ్లం. దురదృష్టవశాత్తు 2004 నుంచి మా శక్తినంతా వర్గీకరణ మీదనే కేంద్రీకరించాల్సి వచ్చింది. గుండె జబ్బులున్న పిల్లల కోసం పోరాడితే ఆరోగ్య శ్రీ వచ్చింది. వికలాంగుల కోసం పోరాడితే పింఛన్లు పెరిగినయ్. ఇలా ఒకటి రెండు కాకుండా పూర్తిస్థాయిలో ఉద్యమిస్తే ఎన్నో సాధించేవాళ్లం. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. ప్రైవేట్ రంగం పెరిగిపోతున్నది. ఈ రంగంలోని అంశాలను ఎజెండాగా చేసుకుని భవిష్యత్తులో దళిత, గిరిజన, బీసీలు ముందుకు నడవాల్సిన అసవరం ఉంది. బడ్జెట్‌లో న్యాయం కోసం పోరాడుదాం. భిన్నాభిప్రాయాలు, అవరోధాలు లేకుండా పనిచేద్దాం. అట్రాసిటీ చట్టం రద్దు కాకుండా కాపాడుకున్నట్లే భవిష్యత్తులో కలిసి పోరాడుదాం’’ అని మంద కృష్ణ పిలుపునిచ్చారు.
మోదీ, వెంకయ్య సహా ఎందరో సహకారం.. అందరికీ ధన్యవాదాలు
తమను ఎందరో పెద్దలు, భిన్న రాజకీయ ఆలోచనలున్న నాయకులు సమర్థించారని మంద కృష్ణ తెలిపారు. ‘‘యావత్ సమాజం మాదిగ దండోరాకు అండగా నిలిచారు. 30 ఏళ్లుగా నావెంట ఉన్న సహచరులు, నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఒక పోరాటం విజయం సాధించింది అంటే అందుకు ప్రజాస్వామ్యవాదులు, పెద్దలు, మీడియా సంపూర్ణ సహకారం వల్లనే. పెద్దలు వెంకయ్యనాయుడు అండగా నిలిచారు. కిషన్‌రెడ్డి భుజానికెత్తుకున్నారు. రఘునందన్‌రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్.. ఇలా దక్షిణాదికి చెందిన బీజేపీ పెద్దలంతా సహకరించారు. న్యాయాన్ని బతికించేందుకు, పేద వర్గాలకు అండగా నిలిచేందుకు ఇచ్చిన తీర్పుగా దీనిని మేం భావిస్తున్నాం’’ అని అభివర్ణించారు.
1996 నుంచి ‘ఆంధ్రజ్యోతి’ మా ఉద్యమంలో ఉంది.
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర అని మందకృష్ణ మాదిగ తెలిపారు. 1996 నుంచి మాదిగ దండోరా ఉద్యమం ప్రతి దశలోనూ తమ వెన్నంటి నిలిచిందన్నారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో వెలకట్టలేని మద్దతు ఇచ్చి.. తాము విజయం సాధించడంలో విశేష తోడ్పాటు అందించిందని కొనియాడారు.
చంద్రబాబు చేసిన చట్టమే నడిపించింది..
‘‘మా పోరాటం ముందుకునడిచి విజయం దక్కిందంటే చంద్రబాబు తెచ్చిన చట్టమే కారణం. నాడు ఆయన వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు వచ్చేవి కాదు. విద్యావకాశాలు దక్కేవి కాదు. చంద్రబాబు చేసిన చట్టాన్నే సుప్రీం కోర్టు సమర్థించింది. ఆయన ఎప్పుడూ న్యాయం, ధర్మం వైపే ఉంటారని మరోసారి రుజువైంది. సుప్రీం తీర్పు చంద్రబాబుకే గర్వకారణం. ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం మా జాతి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు స్థానంలో వైఎస్ జగన్ ఉంటే ఏపీలో వర్గీకరణ అమలయ్యేది కాదేమో?’’ అని మంద కృష్ణ వ్యాఖ్యానించారు.
Updated Date - Aug 02 , 2024 | 03:48 AM