Seethakka: భగీరథ నీళ్లను వినియోగించేలా చర్యలు
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:11 AM
గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా చర్యలు చేపట్టాలని, ఇందు కోసం సరఫరా అవుతున్న తాగునీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల వాడకాన్ని తగ్గించాలి: సీతక్క
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా చర్యలు చేపట్టాలని, ఇందు కోసం సరఫరా అవుతున్న తాగునీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. రూ.వేల కోట్లు ఖర్చుచేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా... ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరునీళ్లపై ఆధారపడుతున్నారని ఈ పరిస్థితిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్వో ప్లాంట్లు, బోరునీటి వల్ల దీర్ఘకాలంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో ప్రజలకు వివరించాలన్నారు.
త్వరలో వికలాంగుల పింఛన్ పెంపు
అసెంబ్లీ ఎన్నికల్లో హామీనిచ్చిన మేరకు వికలాంగులకు త్వరలోనే పింఛన్‌ను పెంచుతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. డిసెంబరు 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వికలాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై క్రీడోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వైకల్యాన్ని దురదృష్టంగా భావించకుండా.. ఓటమి వచ్చినా కుంగిపోకుండా ప్రతిభతో పట్టుదలగా లక్ష్య సాధనకు ప్రయత్నం చేయాలని సూచించారు