Hyderabad: ఫిట్‌లెస్ స్కూల్ బస్!
ABN, Publish Date - Jun 17 , 2024 | 03:48 AM
బడులు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం.. కొత్త తరగతి.. కొత్త పుస్తకాలు, బ్యాగు, యూనిఫాంతో పిల్లలు హుషారుగా వెళుతున్నారు! కానీ బడికి వెళ్లి వచ్చేందుకు వారు ఎక్కుతోంది ఫిట్‌నెస్ లేని బస్సుల్లో! వారి ప్రయాణం సాగుతోంది ప్రమాదపుటంచుల్లో! బడులు తెరుచుకొని నాలుగురోజులైనా రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా ఫిటెనెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 40 శాతానికి పైగా ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులే
బస్సుల ఫిట్‌నెస్ టెస్టుకు ముందుకు రాని స్కూల్ యాజమాన్యాలు
ప్రమాదం నీడన పిల్లల ప్రయాణం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): బడులు మళ్లీ తెరుచుకున్నాయి. కొత్త విద్యాసంవత్సరం.. కొత్త తరగతి.. కొత్త పుస్తకాలు, బ్యాగు, యూనిఫాంతో పిల్లలు హుషారుగా వెళుతున్నారు! కానీ బడికి వెళ్లి వచ్చేందుకు వారు ఎక్కుతోంది ఫిట్‌నెస్ లేని బస్సుల్లో! వారి ప్రయాణం సాగుతోంది ప్రమాదపుటంచుల్లో! బడులు తెరుచుకొని నాలుగురోజులైనా రాష్ట్రవ్యాప్తంగా 40శాతానికి పైగా ఫిటెనెస్ లేని బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. స్కూల్ బస్సుల తనిఖీల తీరు తూతూమంత్రంగా మారింది. వేసవి సెలవులు ముగిశాక స్కూల్ బస్సుల తనిఖీ పేరుతో అధికారులు హడావుడి చేసినా ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. సరైన అనుమతి పత్రాలు లేకుండానే వేల సంఖ్యలో బస్సులు విద్యార్థులను చేరవేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 12న విద్యాసంవత్సరం మొదలైంది. అయితే స్కూల్ బస్సులను పూర్తి ఫిట్‌నె్‌సతో యాజమాన్యాలు సిద్ధం చేసుకునేందుకు మే15 గడువుగా విధించారు.
అంటే.. ఆలోపు మరమ్మత్తులు పూర్తిచేసుకోవడం, అర్హత గల డ్రైవర్‌ను, సహాయకులను నియమించుకోవడం వంటివి చేసుకొని రవాణా శాఖ నుంచి ‘ఫిట్‌నెస్ సర్టిఫికెట్’ పొందాలి. చాలా యజమాన్యాలు ఇవేవీ చేయకుండానే బస్సులకు కేవలం రంగులద్ది కొత్తరూపు తెచ్చాయంతే! రవాణా శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు ఎంతమాత్రం సరితూగని ఈ బస్సుల్లో చాలావాటిని తుక్కు(స్ర్కా్‌ప)గా పరిగణిస్తారు. అయితే ఈ బస్సుల్లోనే విద్యార్థుల రవాణా కోసం ఏడాదికి రూ.30వేల నుంచి రూ60వేల దాకా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ నిర్దేశించి ప్రమాణాలకు విరుద్ధంగా ఉండటంతోనే బస్సుల ఫిట్‌నెస్ కోసం స్కూల్స్ యాజమాన్యాలు ముందుకు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా విద్యార్థులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ‘ఫిట్‌నెస్ లేని బస్సుల్లో’ బడులకు రాకపోకలు సాగిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
14,220 బస్సులే ‘ఫిట్’!
రవాణా శాఖ అఽధికారుల లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధుల రవాణా కోసం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు 23,850 బస్సులను వినియోగిస్తున్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 12,635కు పైగా స్కూల్ బస్సులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,220 బస్సులకే ఫిట్‌నెస్ పత్రాలు జారీఅయ్యాయి. మరో 9,630కి పైగా స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంది. మరి.. ఫిట్‌నె్‌సతో కూడిన స్కూల్ బస్సుల కోసం రవాణా శాఖ ప్రమాణాలను నిర్దేశించింది విద్యార్థులు సులువుగా బస్సు ఎక్కేందుకు, దిగేందుకు సౌకర్యవంతంగా మెట్లు (ఫుట్‌స్టెప్స్) ఏర్పాటు చేయించాలి. పిల్లలు.. చేతులు, తల బయటపెట్టకుండా కిటికీలకు జాలీలు పెట్టాలి. బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్ ఉండాలి. స్కూల్ బస్సులకు బీమా చేయించాలి.
రవాణా శాఖకు పన్నులు చెల్లించి ఉండాలి. డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న, 60 ఏళ్లలోపు వ్యక్తులను డ్రైవర్‌గా, సహాయకుడిగా నియమించుకోవాలి. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిలాల్లో 1203 స్కూల్ బస్సులుండగా ఇప్పటి వరకు 740 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ టెస్ట్ చేయించారు. అధికారుల తనిఖీల్లో 28 బస్సులు ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 787 స్కూల్ బస్సులుండగా 611 బస్సులకే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేశారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని 15 బస్సులను గుర్తించి కేసులు నమోదు చేసి జప్తు చేశారు. ఖమ్మం జిల్లాలో 640 స్కూల్ బస్సులుండగా 380 బస్సులకు ఫిట్‌నెస్ పత్రాలు జారీ చేశారు. 45 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించి స్ర్కాప్‌గా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు.
ఇందుకే ‘టెస్ట్’ చేయించడం లేదు?
ఫిట్‘లెస్’ బస్సుల్లో చాలామటుకు కాలం చెల్లినవే ఉన్నాయి. అర్హత, అనుభవం గల డ్రైవర్ నియమించుకోవాలి అంటే ఎక్కువ వేతనం ఇవాల్సి ఉంటుంది. కాబట్టి.. డ్రైవర్ల నియామకంలో కొన్ని యాజమాన్యాలు ‘డ్రైవింగ్ తెలిస్తే చాలు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి యజమాన్యాలు ఫిట్‌నెస్ టెస్టుకు ఎందుకు ముందుకొస్తాయి? ఇలాంటి బస్సులపై అధికారులు జరిమానా వేసినా, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో దర్జాగా తిరుగుతున్నాయి.
Updated Date - Jun 17 , 2024 | 03:48 AM