Rajagopal Reddy: మంత్రివర్గ విస్తరణపై రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 17 , 2024 | 09:10 PM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలుదాటుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ కూర్పు చేశారు.
యాదాద్రి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలుదాటుతోంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ కూర్పు చేశారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు. దీంతో కాంగ్రెస్‌లో ఆశవాహుల సంఖ్య పెరిగిపోతుంది.
ఎన్నికల తర్వాత కేబినెట్‌ను విస్తరించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ దృష్టి సారించింది. రేవంత్ మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇప్పటివరకు కేబినెట్‌లో చోటు దక్కని జిల్లాలకు అవకాశం కల్పించే ఉద్దేశంతో నలుగురు పేర్లను సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
కాగా .. మంత్రివర్గ విస్తరణపై ముగుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్లో రాజ్ గోపాల్ రెడ్డి ఈరోజు(బుధవారం) పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గ విస్తరణ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. కమిట్మెంట్ ఉన్న నాయకులకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడిందని వివరించారు. తెలంగాణలోనే మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని తొలి ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడం ఆనందంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
రేవంత్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం: అద్దంకి దయాకర్
మరోవైపు రుణమాఫీపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar) మాట్లాడారు. భారత దేశంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు. రైతే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ అన్ని ఖర్చులు తగ్గించి రుణఫీ చేస్తుందని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని చెప్పారు. ఎలాంటి భేషాజాలు లేకుండా ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని వివరించారు.భవిషత్తులో కూడా రైతులకు ఎలాంటి కష్టం రాకుండా రైతు బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని తెలిపారు. రైతులకు ఎలాంటి అనుమానం ఉన్నా స్థానిక కాంగ్రెస్ నాయకులని సంప్రదించాలని అద్దకి దయాకర్ పేర్కొన్నారు.
Updated Date - Jul 17 , 2024 | 09:19 PM