Share News

Naveen Mittal: 15 రోజుల్లో పరిష్కరించండి..

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:17 AM

ధరణి పెండింగ్‌ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగులో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు.

Naveen Mittal: 15 రోజుల్లో పరిష్కరించండి..

  • ధరణి పెండింగ్‌ దరఖాస్తులపై రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌

  • జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌

  • నిర్లక్ష్యం వహించిన వారిపై ప్రభుత్వపరంగా చర్యలుంటాయని హెచ్చరిక

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ధరణి పెండింగ్‌ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగులో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు. ఈనెల 14న కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రస్తావిస్తూ.. అప్పటి నుంచి శుక్రవారం వరకు పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత 14 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,778 దరఖాస్తులను పరిష్కరించగా, 2,34,626 దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు తేలింది. 36,463 పెండింగు దరఖాస్తులతో రంగారెడ్డి మొదటిస్థానంలో ఉండగా.. నల్లగొండ 21,693, సంగారెడ్డి 16,824, వికారాబాద్‌ 14,556, భువనగిరి 10,132, సిద్దిపేట 10,077, మల్కాజిగిరి 10 వేల దరఖాస్తులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


పెండింగు దరఖాస్తులు అత్యధికంగా తహసీల్దార్లు, ఆర్డీవోల వద్ద ఉన్నాయి. దీనిపై నవీన్‌ మిత్తల్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పెండింగు దరఖాస్తులను తహసీల్దార్లు వెంటనే పరిష్కరించాలని, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు సైతం తమవద్ద పెండింగు లేకుండా చూడాలని కోరారు. నిర్లక్ష్యం వహించేవారిపై ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా నవీన్‌ మిత్తల్‌ హెచ్చరించినట్లు తెలిసింది. నిర్లక్ష్యం వహించిన తహసీల్దార్లు, ఆర్డీవోలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. 15 రోజుల్లో పెండింగు దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని, మ్యుటేషన్‌, సక్సేషన్‌ దరఖాస్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే ప్రజావాణి దరఖాస్తులపైనా నవీన్‌ మిత్తల్‌ సమీక్ష జరిపారు. వీటిని పరిష్కరించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 03:17 AM