ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నీట్‌లో ఉత్తరాది ఆధిక్యం..

ABN, Publish Date - Jun 18 , 2024 | 05:28 AM

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష నీట్‌ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతోంది. గడిచిన ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. 2018లో దేశవ్యాప్తంగా 13.26 లక్షల మంది నీట్‌ పరీక్ష రాయడానికి నమోదుచేసుకోగా.. 2024 నాటికి ఆ సంఖ్య 24.06 లక్షలకు చేరుకుంది.

  • 2018తో పోలిస్తే 2024కు ఉత్తరాది అభ్యర్థుల సంఖ్య రెట్టింపు.. దక్షిణాదిన పెరుగుదల అంతంతే

  • 8 మూడేళ్లుగా ఆలిండియా

  • టాప్‌100లో తగ్గుతున్న మనోళ్ల సంఖ్య

  • 8 ఆఫ్‌లైన్‌ పరీక్ష కావడంతో అక్రమాల ముప్పు ఎక్కువంటున్న నిపుణులు

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష నీట్‌ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతోంది. గడిచిన ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. 2018లో దేశవ్యాప్తంగా 13.26 లక్షల మంది నీట్‌ పరీక్ష రాయడానికి నమోదుచేసుకోగా.. 2024 నాటికి ఆ సంఖ్య 24.06 లక్షలకు చేరుకుంది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి నీట్‌ రాసే వారి సంఖ్య రెట్టింపయింది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆ స్థాయిలో పెరగలేదు. రెండు, మూడేళ్లుగా టాప్‌-100 విద్యార్థుల్లో.. ఉత్తరాదివారితో పోల్చితే దక్షిణాదివారు తక్కువగా కనిపిస్తున్నారు. ఈ ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే.. టాప్‌ 100 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కేవలం నలుగురే ఉన్నారు. అందులో ముగ్గురు ఏపీ వారు కాగా తెలంగాణ విద్యార్థి ఒక్కరే. గతంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇంత తక్కువగా కనిపించే వారు కాదని, టాప్‌-100లో మనోళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేదని వైద్యవిద్య నిపుణులు గుర్తుచేస్తున్నారు.


నీట్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరుగుతుండడంతో.. ఉత్తరాది రాష్ట్రాల్లోని కొన్నిచోట్ల పేపర్‌ లీక్‌ అవుతోందని, పరీక్షా కేంద్రాల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని వైద్యవిద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కావడం, ఇన్విజిలేటర్స్‌ సాయం చేయడం వంటి అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల ఆలిండియా కోటాలో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని వైద్యవిద్య నిపుణులు, తల్లిదండ్రు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలిండియా కోటా లో 15శాతం సీట్లుంటాయి. ఎక్కువ స్కోర్‌ చేసిన వారికే ఎయిమ్స్‌లోనూ, ఆలిండియా కోటాలోనూ సీటు దక్కే చాన్స్‌ ఉంటుంది.


ఈసారి ఉత్తరాది వారే ఎక్కువగా నీట్‌లో స్కోరింగ్‌ చేశారు. దాంతో ఆలిండియా కోటాలో సీట్లలో మెజారిటీ వారికే దక్కే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో నీట్‌ రాసే విద్యార్థుల సంఖ్య గడిచిన ఏడేళ్లలో దాదాపు రెట్టింపు అయింది. ఆయారాష్ట్రాల నుంచి 2018లో 4,78,255 మంది నీట్‌కు హాజరు కాగా.. 2024లో అవే రాష్ట్రాల నుంచి 11,57,180 మంది నీట్‌ రాశారు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, కేరళలో ఈ ఏడేళ్లలో వైద్య కళాశాలలు పెరిగాయిగానీ.. నీట్‌ రాసే విద్యార్థుల సంఖ్య గడచిన ఉత్తరాది రాష్ట్రాల స్థాయిలో పెరగలేదు. 2018లో ఈ ఐదు రాష్ట్రాల నుంచి 4,24,523 మంది నీట్‌కు హాజరు కాగా.. 2024 నాటికి ఆ సంఖ్య 5,82,845కు పెరిగింది.


కాలేజీలు ఇక్కడే ఎక్కువ..

2018 నాటికి దేశంలో 499 మెడికల్‌ కాలేజీలు.. వాటిలో 70012 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 706 మెడికల్‌ కాలేజీలుండగా.. వాటిలో 1,08,940 సీట్లున్నాయి. ఉత్తరాదితో పొల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాలోనే కాలేజీలు, సీట్లు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం 270 మెడికల్‌ కాలేజీలుండగా.. మిగిలిన అన్ని రాష్ట్రాలో కలిపి 436 వైద్య కళాశాలలున్నాయి. అంటే దేశంలోని మొత్తం మెడికల్‌ కాలేజీల్లో 38 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. సీట్ల విషయానికొస్తే.. ఈ ఐదు రాష్ట్రాల్లో 43,525, మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి 65,415 సీట్లున్నాయి.


ర్యాంకులన్నీ ఉత్తరాదికేనా?

గడచిన మూడేళ్లుగా దక్షణాదికి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నీట్‌ టాప్‌ 100 జాబితాలో తగ్గుతూ వస్తున్నారు. గతంలో టాప్‌-100లో మనోళ్లు కనీసం 25-30 మంది ఉండేవారు. నిరుడు 687పైగా మార్కులను సుమారు వెయ్యి మంది సాధించగా.. అందులో 40 మంది వరకూ తెలుగువారే. ఈసారి 687పైగా మార్కులు సాధించిన సంఖ్య దాదాపు ఏడువేలు. అంటే ఏడు రెట్లు పెరిగారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్యకళాశాలల సంఖ్య తక్కువ. డబ్బులు కట్టి ప్రైవేటులో చేరేవారు తక్కువే. అందుకే అక్కడ కన్వీనర్‌ కోటాలో సీటు కొట్టేందుకు ఒక్కొక్కరు ఐదారుసార్లు నీట్‌ రాస్తుంటారు.


ఎయిమ్స్‌లో తగ్గుతున్న మనోళ్ల సంఖ్య

మెడిసిన్‌ ర్యాంకులంటే రెండు మూడేళ్ల క్రితం వరకూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులదే హవా. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆలిండియా టాప్‌ 100 జాబితాలో మన విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో 132 సీట్లుంటే గతేడాది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 35 సీట్లు పొందారు. ఏటా 25 మంది దాకా అక్కడే సీటు సాధించేవారు. కానీ దేశంలోని ఏ ఎయిమ్స్‌లోనూ తెలుగు విద్యార్థులు సీట్లు పొందడం కష్టంగా మారింది. ఈ ఏడాది 705పైగా మార్కులు సాధించిన వారు 2 వేల మంది ఉన్నారు. నీట్‌ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరగడం అనేక అక్రమాలకు, అనుమానాలకు తావిస్తోంది. అదే ఆన్‌లైన్‌లో జరిగితే దక్షిణాది రాష్ట్రాలు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈస్థాయిలో నష్టపోయే అవకాశం ఉండదు.

- డి. శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్య కాలేజీ, హైదరాబాద్‌

Updated Date - Jun 18 , 2024 | 05:29 AM

Advertising
Advertising