Share News

Kaleshwaram: వానాకాలానికి అన్నారం సిద్ధం!

ABN , Publish Date - Jun 10 , 2024 | 05:19 AM

వానాకాలంలో అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్‌ గ్రౌటింగ్‌, సిమెంట్‌ అడ్మిక్చర్‌ గ్రౌటింగ్‌ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

Kaleshwaram: వానాకాలానికి అన్నారం సిద్ధం!

  • లీకేజీ ఏర్పడిన 4 వెంట్లలో గ్రౌటింగ్‌ పూర్తి

  • మట్టి నమూనాల సేకరణకు ఏర్పాట్లు

  • మేడిగడ్డ స్థితి తలెత్తకుండాచర్యలు

  • ఇప్పటికిప్పుడు వరదొచ్చినా తట్టుకునేలా!

  • నీటిని నిల్వ చేసేందుకు సన్నాహాలు

మహదేవపూర్‌ రూరల్‌, జూన్‌ 9: వానాకాలంలో అన్నారం బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కెమికల్‌ గ్రౌటింగ్‌, సిమెంట్‌ అడ్మిక్చర్‌ గ్రౌటింగ్‌ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. బ్యారేజీ ప్లాట్‌ఫాం మీద ఉన్న ఇసుక తొలగింపు కూడా పూర్తయింది. బ్యారేజీకి దిగువన సీసీ బ్లాకుల పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఎన్‌డీఎ్‌సఏ సూచించిన పరీక్షలు కొన్ని ఇప్పటికే పూర్తివగా సాయిల్‌ (మట్టి నమూనా) టెస్టులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వానాకాలం పూర్తయ్యేనాటికి ఎన్‌డీఎ్‌సఏ అనుమతితో నీటిని నిల్వచేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికిప్పడు వరద లొచ్చినా తట్టుకునే విధంగా అన్నారం బ్యారేజీ సిద్ధమైనట్లు ఓ అధికారి చెప్పారు. అన్నారం బ్యారేజీలో 28, 38, 35, 44 వెంట్లలో లీకేజీలు ఏర్పడగా వరంగల్‌కు చెందిన ఎన్‌ఐటీ ప్రొఫెసర్ల బృందం సలహాలతో తాత్కాలికంగా వాటిని అరికట్టారు. అయినప్పటికీ నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్నిరకాల గ్రౌటింగ్‌ పనులను పూర్తి చేశారు.


తొలుత లీకేజీ ఏర్పడిన వెంట్లలో కెమికల్‌ గ్రౌటింగ్‌ చేసిన అధికారులు ఆ తర్వాత సిమెంట్‌, వెంటోనేట్‌ గ్రౌటింగ్‌ పూర్తిచేశారు. వీటితో పాటు వారం క్రితం ప్రారంభించిన సిమెంట్‌ అడ్మిక్చర్‌ గ్రౌటింగ్‌ పనులు శనివారంతో పూర్తి చేశారు. కెమికల్‌ గ్రౌటింగ్‌తో లీకేజీలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నా, సిమెంట్‌, వెంటోనేట్‌ గ్రౌటింగ్‌ వల్ల అక్కడక్కడ ఉన్న ఖాళీ ప్రదేశాలకు గోడకట్టినట్టు ఏర్పడి లీకేజీలను అరికడతాయనే ఉద్దేశంతో ఎన్‌డీఎ్‌సఏ సూచనల మేరకు అదనంగా ఈ రెండు రకాల గ్రౌటింగ్‌ చేపట్టి పూర్తి చేశారు. గ్రౌటింగ్‌తో పాటు బ్యారేజీకి ఎగువన, దిగువన 5వేల మీటర్ల మేర బాతోమెట్రిక్‌ సర్వే పూర్తిచేసిన అధికారులు ఎన్‌డీఏ్‌సఏకు సర్వేను నివేదించినట్లు తెలిసింది. బ్యారేజీకి ఎగువన పిల్లర్లకు ముందున్న ప్లాట్‌ఫాంపై పేరుకుపోయిన ఇసుక తొలగింపు పనులు ఇప్పటికే పూర్తి చేసిన స్ట్రక్చర్‌ ఏరియా, లాంచింగ్‌ అప్రాన్‌లపై ఉన్న ఇసుక తొలగింపు పనులను సైతం చివరి దశకు వచ్చాయి.


మేడిగడ్డ పరిస్థితి రాకుండా

అన్నారం బ్యారేజీకి దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితులు అన్నారం బ్యారేజీకి తలెత్తకుండా ఎన్‌డీఎ్‌సఏ సూచనల ప్రకారం మరో టెస్టుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. లీకేజీ ఎర్పడిన 28 ,38, 35, 44 వెంట్లలో బోర్‌వెల్‌ ద్వారా 25మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేసి బ్యారేజీ కింద ఉన్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. పుణెకు చెందిన సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్యూపీఆర్‌ఎస్‌) నిపుణుల బృందం ఈ పరీక్షలు చేపట్టనున్నారు. ఎన్‌డీఏ్‌సఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు ఓ అధికారి వివరించారు. ఈఆర్‌టీ, జీపీఆర్‌ టెస్టులతోపాటు సాయిల్‌ టెస్టుల ద్వారా బ్యారేజీ శాశ్వత రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఎన్‌డీఏ్‌సఏ సూచించినట్లు తెలిసింది.


ఈ నమూనాలతో సాయిల్‌ క్లాసిఫికేషన్‌, సాయిల్‌ డెన్సిటీ, సాయిల్‌ తేమ శాతం, అటర్‌ బర్గ్‌ లిమిట్స్‌ పరీక్షలు చేయనున్నారు. సాయిల్‌ క్లాసిఫికేషన్‌ ద్వారా బ్యారేజీ కింద ఉన్న మట్టి రకంతో పాటు దాని నాణ్యత, మట్టిలో ఉన్న తేమ శాతాన్ని గుర్తించనున్నారు. అటర్‌ బర్గ్‌ లిమిట్స్‌ టెస్టు ద్వారా బ్యారేజీలో నిల్వ ఉన్న నీరు మట్టిని తాకినప్పుడు నేల స్వభావం ఏమిటనేది తెలుసుకోనున్నారు. ఈ టెస్టుల ఫలితం బ్యారేజీ నిర్మాణానికి ముందుకు చేసిన టెస్టులతో పోల్చి బ్యారేజీ పరిస్థితి ఏమిటనేది సంపూర్ణంగా అనాలసిస్‌ చేయనున్నారు. సీసీ బ్లాకులు జాపోవడానికి కారణాలను ఈ పరీక్షల ద్వారా తెలుసుకోనున్నారు. మేడిగడ్డలో సీపేజీ సమస్య అధికం కావడం వల్లే పిల్లర్లు కుంగుబాటుకు గురికాగా ఆ సమస్య అన్నారం బ్యారేజీకి తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోరెండు రోజుల్లో మట్టి నమూనాలు సేకరించేందుకు యంత్రాలు, అందుకు అవసరమైన సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.


మేడిగడ్డలో ఒక గేటు కట్‌

  • విడి భాగాల తరలింపు పని ప్రారంభం

మహదేవపూర్‌ రూరల్‌, జూన్‌ 9 : మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన 21వ గేటు కత్తిరింపు పని ఎట్టకేలకు పూర్తయినట్టు తెలిసింది. మే 25 న ఈ గేటు కటింగ్‌ పనులను మొదలుపెట్టారు. ఆదివారం అది పూర్తవడంతో.. కత్తిరించిన విడి భాగాలను తరలించే పనులను ప్రారంభించారు. మరోవైపు 20వ గేటు కటింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. 21వ గేటు విడిభాగాలను తొలగించాకే.. 20వ గేటును కత్తిరించే పనులు ముమ్మరం అవుతాయని ఒక అధికారి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన బ్లాక్‌-7లో గత నెలలో అధికారులు పలు గేట్లను ఎత్తారు. అయితే, కొన్ని కారణాల రీత్యా 20, 21 గేట్లను ఎత్తేందుకు వీలు లేకపోవడంతో వాటిని కట్‌ చేసి తొలగిస్తున్నారు. మరోవైపు, బ్యారేజీ కింద ఉన్న మట్టితో పాటు ఇతర పరీక్షల నిమిత్తం వచ్చిన సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ సభ్యుడు హరిదేవ్‌ నేతృత్వంలోని ఏడుగురు నిపుణుల బృందం చేపట్టిన పరీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా చేపట్టిన ఇసుక, సిమెంట్‌ గ్రౌటింగ్‌, షీట్‌పైల్స్‌ అమరిక, సీసీ బ్లాకుల రీ అరెంజ్‌మెంట్‌ పనులు కొనసాగుతున్నాయి.

Updated Date - Jun 10 , 2024 | 05:19 AM