Jaggareddy: టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం..
ABN, Publish Date - Jul 09 , 2024 | 02:01 AM
తెలంగాణలో బీజేపీ.. టీడీపీని ముందు పెట్టి రాజకీయాలను మొదలు పెట్టిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో ఆడిన పొలిటికల్ గేమ్‌నే తెలంగాణలోనూ ఆడాలని చూస్తోందన్నారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా.. కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేదన్నారు.
ఏపీలో ఆడిన పొలిటికల్ గేమ్‌ను ఇక్కడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు
విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిండు
బీజేపీ డైరెక్షన్‌లో బాబు, పవన్ కల్యాణ్ పని చేస్తున్నరు
కాంగ్రెస్ కార్యకర్తలూ అలర్ట్‌గా ఉండండి
బీజేపీ ఎన్ని వ్యూహాలు చేసినా కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేదు: జగ్గారెడ్డి
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ.. టీడీపీని ముందు పెట్టి రాజకీయాలను మొదలు పెట్టిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో ఆడిన పొలిటికల్ గేమ్‌నే తెలంగాణలోనూ ఆడాలని చూస్తోందన్నారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా.. కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని చంపలేదన్నారు. అయినా రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు.. కొన్ని సందర్భాల్లో బలపడటం, కొన్ని సందర్భాల్లో బలహీనపడటం సహజమన్నారు. ఉత్తర భారత దేశంలో బీజేపీకి బలం తగ్గడంతో ఆ పార్టీ దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, కర్ణాటకపై దృష్టి పెట్టిందన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఫలితాలే కేంద్రంలో బీజేపీకి అధికారాన్ని తెచ్చి పెట్టాయని విశ్లేషించారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే బలహీన పడి ఉంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు.
ఏపీలో పరోక్షంగా జగన్‌ను మెయింటైన్ చేస్తూ, పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి చంద్రబాబును కంట్రోల్‌లో తెచ్చుకున్న బీజేపీ.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో నాలుగు స్థంభాల ఆట నడిపించిందన్నారు. ఆ ఆటలో కాంగ్రెస్ పార్టీని అక్కడ లేవకుండా చేస్తోందన్నారు. ఏపీలో అసలు పట్టే లేని బీజేపీ.. మూడు సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. ఏపీలో మాదిరిగానే ఇక్కడా పొలిటికల్ గేమ్‌ను బీజేపీ స్టార్ట్ చేసిందన్నారు. అక్కడ పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టి రాజకీయం చేస్తే.. ఇక్కడ టీడీపీని ముందు పెట్టి రాజకీయం మొదలు పెట్టిందన్నారు. పదేళ్ల తర్వాత పొలిటికల్‌గా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు.. బీజేపీ డిజైన్‌లో పని చేస్తున్నారని, దీనికి మద్దతుగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డౌన్ అయిన కేసీఆర్.. బీజేపీతో కొట్లాడాలని చూస్తారా? లేదంటే జైల్లో ఉన్న కూతురిపై ప్రేమతో మోదీ, అమిత్‌షా చెప్పింది విని... తెలంగాణలో బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో నాలుగో స్థంభంగా మారుతారా? అన్నది చూడాలన్నారు. గతంలో చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చి పోయేది కూడా ఎవ్వరికీ తెలియకపోయేదన్నారు.
విభజన సమస్యల పేరుతో తెలంగాణ గడ్డపైన చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారన్నారు. రాజకీయంగా ఇష్టం లేకున్నా విభజన సమస్యలు ఉన్నాయి కాబట్టి తమ ముఖ్యమంత్రి ఆయనతో భేటీ కావాల్సి వచ్చిందన్నారు. ఆ భేటీ ముగిసిన తర్వాత.. చంద్రబాబు తన అసలు రంగు బయటపెట్టారన్నారు. రెండు రాష్ట్రాలు.. రెండు కళ్లన్న సంగతి చంద్రబాబుకు మళ్లీ గుర్తుకు వచ్చిందన్నారు. నామినేటెడ్ పదవులకు యోధుడు పోటీ పడడని, యుద్ధం చేసే గెలుస్తాడని చెబుతూ సంగారెడ్డి ప్రజలు తనను మళ్లీ గెలిపించుకుని రాజును చేస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉన్నవారిని బీజేపీలోకి తీసుకోబోమని బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఇప్పటికే ఆ కేసులు ఉన్నవారిని ఆ పార్టీ చేర్చేసుకుందన్నారు. బీజేపీ ఇంకా నిలబడుతుందంటే.. ఈడీ, సీబీఐ, ఐటీల వల్లనేనన్నారు. వీటిని ఉపయోగించకపోతే రాహూల్ ప్రధాని అయ్యేవారని పేర్కొన్నారు.
Updated Date - Jul 09 , 2024 | 02:01 AM