Suryapet Floods: పంట పోయింది.. ఇసుక మేట మిగిలింది
ABN , Publish Date - Sep 06 , 2024 | 04:20 AM
వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది.
సూర్యాపేట జిల్లా రైతును కదిలిస్తే కన్నీరే
కోదాడ రూరల్, ఆత్మకూర్(ఎస్), సెప్టెంబరు 5: వారం రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తి, మిర్చి, వరి పొలాల్లో పూర్తిగా ఇసుక మేట వేసింది. దీంతో పంటలు నామరూపాలు లేకుండా పోయాయి. అయ్యావారి కుంట అలుగు పోయడంతో ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్‌లో అరేంపుల రాజుకు చెందిన రెండు ఎకరాల మిరప తోట కొట్టుకుపోయింది. మిడ్తనపల్లి గ్రామంలో సామ నారాయణరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సైదులు, బిక్షం, లక్ష్మారెడ్డి, రామిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డిలకు చెందిన పొలాలు ఏటి వరదతో మునిగిపోయాయి.
మక్తా కొత్తగూడెంలో బద్దం లింగమల్లారెడ్డి, బద్దం ధర్మారెడ్డి, గుండాల గురువయ్య, సామా వెంకట్‌రెడ్డి వరి పొలాలు కొట్టుకుపోయాయి. కోదాడ మండలంలో తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు నీట మునిగాయి. అధికారులు తమ వద్దకు వచ్చి వివరాలు తీసుకోలేదని తొగర్రాయి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ గ్రామంలో పర్యటించినా.. ఇతర అధికారులు ఎవరూ నష్టం అంచనాకు రాలేదని బాధితులు తెలిపారు. చిలుకూరు మండలం నారాయణపురం, సీతారాంపురం, చిలుకూరు చెరువులు తెగి వరద తొగర్రాయి గ్రామం మీదుగా వెళ్లింది. మోకాలు లోతు బురదలో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.