Kukatpally: శ్రీధర్‌బాబుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ..
ABN, Publish Date - Jul 07 , 2024 | 04:25 AM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శనివారం మంత్రి డి.శ్రీధర్‌బాబును కలుసుకున్నారు. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, అరికపూడి గాంధీ, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద..
హైదరాబాద్‌కు చెందిన ఆరుగురి సమావేశం
కూకట్‌పల్లిలో సమస్యల పరిష్కారానికని మంత్రి వద్దకు
వీరిలో ఐదుగురు 5న బీఆర్‌ఎస్ భేటీకి గైర్హాజరు
కూకట్‌పల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శనివారం మంత్రి డి.శ్రీధర్‌బాబును కలుసుకున్నారు. మాధవరం కృష్ణారావు, బండారు లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, అరికపూడి గాంధీ, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద.. సచివాలయంలో మంత్రిని కలిశారు. మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా శ్రీధర్‌బాబు వ్యవహరిస్తుండడంతో.. ఆ జిల్లా పరిధిలోకి వచ్చే కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. మంత్రి శ్రీధర్‌బాబుకు వద్దకు వెళ్లారు. నియోజకవర్గంలోని చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి దోమల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
అదేవిధంగా విద్యుత్ స్థలాలు, వీధిదీపాలు, పారిశుధ్య సమస్యలతో కాలనీవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వినతిపై స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యల పరిష్కారంలో కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినట్లు ఎమ్మెల్యే వివరించారు. అయితే కూకట్‌పల్లి నియోజకవర్గ సమస్యలపై వెళ్లిన ఎమ్మెల్యేతోపాటు ఇతర ఎమ్మెల్యేలు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పైగా.. వీరిలో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం బీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్వహించిన శాసనసభ్యులు, కార్పొరేటర్ల సమావేశానికి గైర్హాజరు కావడంతో మంత్రితో వీరి భేటీపై స్థానికంగా పలురకాలుగా చర్చించుకుంటున్నారు.
Updated Date - Jul 07 , 2024 | 04:25 AM