Share News

Education: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4,769 కోట్లు

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:00 AM

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద దాదాపు రూ.4,769 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పోగయ్యాయి. ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు మూడేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లింపులు చేయలేదు.

Education: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4,769 కోట్లు

  • ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు మూడేళ్ల నుంచి పెండింగ్‌లోనే..

  • వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లిస్తామన్న సీఎం

  • స్పష్టత ఇవ్వాలని కోరుతున్న కాలేజీల యాజమాన్యాలు

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద దాదాపు రూ.4,769 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పోగయ్యాయి. ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్‌ వరకు మూడేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లింపులు చేయలేదు. 2021-22లో రూ.326కోట్లు, 2022-23లో రూ.1,830కోట్లు, 2023-24లో రూ.2,250కోట్లతో పాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించి 2020-21లో రూ.250 కోట్లు, మెస్‌చార్జీలకు రూ.500 కోట్లు కలిపి దాదాపు రూ.5,156 కోట్లకుపైగా బకాయిలున్నాయి. గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పాత బకాయిల కింద రూ.387కోట్లు చెల్లించింది. ఇవి పోగా సుమారు రూ.4,769 కోట్ల బకాయిలున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల కోసం రూ.2,250కోట్లు అవసరంకానున్నాయి.


ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో జరిగిన సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపులపై సీఎం రేవంత్‌ చేసిన ప్రకటన చర్చనీయాశంగా మారింది. ఈ విద్యా సంవత్సరం నుంచి సకాలంలో రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు ఉంటాయని, పాత బకాయిల చెల్లింపును వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చేస్తామన్నారు. దీనిపై యాజమాన్యాలు ఒక ఆలోచనకు వచ్చి తమకు తెలియజేస్తే దానికి కట్టుబడి ఉంటామని సీఎం తెలిపారు. అయితే చెల్లింపులు బాగానే ఉన్నా.. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానం కొత్తగా ఉందని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి.


ఇప్పటికే సిబ్బందికి పూర్తిస్థాయి జీతాలిచ్చామని, ఇప్పుడు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద ఓ ఆలోచనతో రావాలనడంపై అయోమయంలో ఉన్నట్టు పేర్కొన్నాయి. దీనిపై స్పష్టతివ్వాలని కోరుతున్నాయి. కాగా గత ప్రభుత్వం రెండున్నరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంచిన విద్యా బకాయిలను చెల్లించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల అసోసియేషన్‌ అధ్యక్షులు గౌరి సతీష్‌ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. త్వరితగతిన చెల్లింపునకు చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - Jul 14 , 2024 | 04:00 AM