ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ‘స్థానికత’పై సుప్రీంకు సర్కారు

ABN, Publish Date - Sep 13 , 2024 | 03:41 AM

వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

  • త్వరగా విచారించాలన్న విజ్ఞప్తికి ధర్మాసనం ఓకే

  • హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్య ప్రవేశాలు

  • సర్కారుకు అనుకూలంగా తీర్పు వస్తే వేగంగా అడ్మిషన్లు

  • లేదంటే మళ్లీ మార్గదర్శకాలు ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వైద్య విద్యలో అడ్మిషన్లు పొందడానికి తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్మీడియట్‌ విద్యను తెలంగాణలో పూర్తి చేసిన వారికే స్థానిక రిజర్వేషన్‌ వర్తింపజేస్తామంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33పై పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదువుకోలేదన్న కారణంతో శాశ్వత నివాసులకు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్‌ నిరాకరించకూడదని సదరు ఆదేశాల్లో పేర్కొంది. దీన్ని సవాల్‌ చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనాన్ని తెలంగాణ తరఫు న్యాయవాదులు కోరగా.. ధర్మాసనం అంగీకరించింది.


అయితే, వైద్య విద్య ప్రవేశాలపై సందిగ్ధం నెలకొన్న వేళ.. సుప్రీం కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇస్తే... వెంటనే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక వేళ హైకోర్టు తీర్పును సమర్థిస్తే మాత్రం కౌన్సెలింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వైద్య శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అక్టోబరు 1 నుంచే వైద్య విద్య తరగతులు ప్రారంభం కావాలి. అక్టోబరు 30లోగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టకూడదు. అందుకు మరో 47 రోజులే గడువు ఉండగా.. రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రవేశాల ప్రక్రియే ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయమై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో వైద్య విద్య ప్రవేశాలపై సమీక్ష నిర్వహించారు. కౌన్సెలింగ్‌ పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందంటూ ఆరా తీశారు. ఒక వేళ సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు రాకుంటే తక్షణమే స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంటుందని, ఆ ప్రకారం రిసిడెన్స్‌ సర్టిఫికెట్ల జారీకి సమయం పడుతుందని అధికారులు మంత్రికి వివరించారు.


  • 4 రౌండ్లు... ఒక్కో దానికి 10 రోజులు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నాలుగు విడతల్లో నిర్వహిస్తారు. కన్వీనర్‌, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీ తర్వాత, విద్యార్థులు చేరకుండా మిగిలిపోయిన సీట్లకు చివరిగా స్ట్రే వేకెన్సీ రౌండ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఒక్కో రౌండ్‌కు కనీసం పది రోజుల సమయం పడుతుంది. ఈ ఏడాది ఎంబీబీఎ్‌సలో కన్వీనర్‌ కోటా సీట్ల కోసం 17,654 మంది, యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కేటగిరీల కింద మరో 6,468 మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరసి మొత్తం 24,122 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ అంతా అక్టోబరు 30లోగానే పూర్తి చేయాలి. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆలోగా ప్రక్రియ పూర్తి చేయకుంటే మిగిలిపోయిన సీట్లను అలా వదిలేయాల్సిందే. ఈ నేపథ్యంలో అటు వైద్యశాఖలోనూ, ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత నెల 3వ తేదీ నుంచే దేశ వ్యాప్తంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆలిండియా కోటా సీట్లకు ఆగస్టు రెండో వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తయింది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పువచ్చినా...సమయం సరిపోకపోవచ్చన్న అభిప్రాయాలున్నాయి.ఈ నేపథ్యంలో ఒక వేళ రాష్ట్రంలో సీటు రాని విద్యార్థులు.. పొరుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో చేరే అవకాశం కోల్పోనున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 04:33 AM

Advertising
Advertising