Share News

Film Industry: ‘గద్దర్‌’ అవార్డుల విధివిధానాలకు కమిటీ

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:48 AM

సినిమా రంగంలో గద్దర్‌ అవార్డుల కోసం విధివిధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి.నర్సింగ్‌రావు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

Film Industry: ‘గద్దర్‌’ అవార్డుల విధివిధానాలకు కమిటీ

  • చైర్మన్‌గా దర్శకుడు బి.నర్సింగ్‌రావు

  • వైస్‌ చైర్మన్‌గా సినీ నిర్మాత దిల్‌ రాజు

  • మరో 14 మంది సలహా సభ్యులు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): సినిమా రంగంలో గద్దర్‌ అవార్డుల కోసం విధివిధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి.నర్సింగ్‌రావు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎ్‌ఫడీసీ) చేసిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది.


గద్దర్‌ అవార్డుల పేరును ఖాయం చేస్తూ దీనికి లోగోను కూడా కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇదివరకు సినిమా రంగంలో నంది అవార్డులను ప్రదానం చేసేవారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక నంది అవార్డుల పేరును మార్చి గద్దర్‌ అవార్డులుగా ప్రకటించింది. కమిటీ వైస్‌ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు (వి.వెంకటరమణారెడ్డి)ను, మెంబర్‌ కన్వీనర్లుగా టీజీఎ్‌ఫడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శిని నియమించింది.


సలహా సభ్యులుగా సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, జయ జయహే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ (అందె ఎల్లన్న), సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్‌, గద్దర్‌ కూతురు గుమ్మడి వి.వెన్నెల, సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ నిర్మాత డి.సురేశ్‌బాబు, సినీ గేయ రచయిత కె.చంద్రబోస్‌, సినీ నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి, సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, అల్లాణి శ్రీధర్‌, సినీ నిర్మాత సాన యాదిరెడ్డి, దర్శకుడు హరీశ్‌ శంకర్‌, బలగం సినిమా దర్శకుడు యెల్దండి వేణులను నియమించింది.

Updated Date - Aug 23 , 2024 | 03:48 AM