Hyderabad: 1న రుణమాఫీకి శ్రీకారం!
ABN , Publish Date - Jun 25 , 2024 | 03:04 AM
రుణ మాఫీ పథకం అమలుకు జూలై ఒకటో తేదీ నుంచే సర్కారు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఆగస్టు 15లోపు పూర్తి చేసేలా నిర్ణయం
అగ్రికల్చర్ గోల్డ్ రుణాలు కూడా మాఫీ
పట్ణణాల్లో తీసుకుంటే వర్తించదు
దాదాపుగా పాత మార్గదర్శకాలే అమలు
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రుణ మాఫీ పథకం అమలుకు జూలై ఒకటో తేదీ నుంచే సర్కారు శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణ మాఫీ అమలుకు దాదాపు రూ.31 వేల కోట్లు అవసరమని సర్కారు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవటం, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవటం, ‘ఆదాయ శాఖల’ నుంచి నిధులను సర్దుబాటు చేసుకోవాలని కసరత్తు చేస్తోంది.
కాగా, రుణమాఫీ పథకం అమలుకు గతంలో అనుసరించిన విధానాలనే పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమచారం. అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు. రైతు కుటుంబం అంటే.. భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే... వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకు రానున్నారు.
అగ్రి- గోల్డ్ రుణాలూ మాఫీ
బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకాన్ని జత చేసి తీసుకున్న బంగారం రుణాలనే పథకం పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మినహాయించాలని యోచిస్తోంది. గతంలో ఈ తరహా నిబంధనలనే అమలు చే శారు. ఇప్పుడు కూడా వాటినే అమలు చేయనున్నారు. అలాగే, నిర్ణీత వ్యవధిలో కటాఫ్ తేదీలోపు తీసుకున్న రుణాలతోపాటు రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు కూడా రుణమాఫీ పథకంలోకి వస్తాయి.