Share News

TG News : నాలా కబ్జా చేసి కట్టారు

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:13 AM

జన్వాడ ఫామ్‌హౌ్‌సను బుల్కాపూర్‌ నాలాను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అదీ సాక్షాత్తూ బీఆర్‌ఎస్‌ హయాంలోనే తెలిసింది. ఈ ఫామ్‌హౌ్‌సకు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్‌ నాలాపైనే నిర్మించారు.

TG News : నాలా కబ్జా చేసి కట్టారు

  • ‘జన్వాడ ఫామ్‌హౌస్‌ ’పై బీఆర్‌ఎస్‌ హయాంలోనే అధికారుల నివేదిక

  • బుల్కాపూర్‌ నాలాపైనే ప్రధాన గేటు..

  • బఫర్‌జోన్‌లో ప్రహరీగోడ, 13 గుంటలు

  • నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం

  • ఫామ్‌హౌస్‌ పరిశీలనకు హైడ్రా అధికారులు కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాంఆలోగా యాజమాన్యాలే ఆక్రమణలను తొలగించాలి

  • లేని పక్షంలో సెలవుల్లో మేమే చర్యలు తీసుకుంటాం

  • పేదల ఇళ్లు, చిన్న గృహాలను కూల్చబోం: రంగనాథ్‌

  • హైడ్రా ముందుకు వేల సంఖ్యలో ఫిర్యాదులు

  • ఫాక్‌ సాగర్‌ను పరిశీలించిన కమిషనర్‌ రంగనాథ్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

జన్వాడ ఫామ్‌హౌ్‌సను బుల్కాపూర్‌ నాలాను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణలో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అదీ సాక్షాత్తూ బీఆర్‌ఎస్‌ హయాంలోనే తెలిసింది. ఈ ఫామ్‌హౌ్‌సకు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కాపూర్‌ నాలాపైనే నిర్మించారు. దీనిపై అప్పట్లో అప్పటి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్‌ 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్‌హౌ్‌సకు ఆనుకుని ఉన్న బుల్కాపూర్‌ నాలా కబ్జాకు గురైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాన నీరు బుల్కాపూర్‌ నాలా ద్వారా ఉస్మాన్‌సాగర్‌లోకి వెళ్తుంది.

ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని.. కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారులు సదరు నివేదికలో తెలిపారు. అలాగే ఈ నాలాకు రెండు వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్‌జోన్‌ ఉంటుందని, ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఫామ్‌హౌస్‌ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్‌జోన్‌లోనే ఉందని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌ ప్రహరీగోడను నాలాతోపాటు బఫర్‌జోన్‌లో నిర్మించారని నివేదికలో స్పష్టం చేశారు. అయితే

అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండటంతో దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నివేదికనే బయటకు రాకుండా తొక్కి పెట్టారు. ఇపుడు ఈ నివేదిక బయటపడింది. దీని ఆధారంగానే మరోసారి సర్వే జరిపి రెండు, మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


నాడు రేవంత్‌పై కేసు.. జైలుకు

జన్వాడలో ఫామ్‌హౌ్‌సను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపించారు. అక్రమ నిర్మాణమని నిరూపించేందుకు అప్పట్లో రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించారు. ఫామ్‌హౌస్‌ చుట్టుపక్కల కేటీఆర్‌ భార్య, బంధువుల భూములు ఉన్నట్లు పేర్కొనే డాక్యుమెంట్లను బయటపెట్టారు.

ఇదే సమయంలో ఓ డ్రోన్‌ ద్వారా ఈ ఫామ్‌హౌస్‌ ఫోటోలు తీశారనే ఆరోపణతో రేవంత్‌పై అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసు పెట్టి ఆయనను జైలుకు పంపింది. ఈ వివాదం సందర్భంలోనే రేవంత్‌రెడ్డి.. ఈ ఫాంహౌస్‌ 111 జీవో పరిధిలో ఉందని పేర్కొంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేశారు.

దీంతో ఫామ్‌హౌస్‌ వివరాలు వెల్లడించాలని ట్రైబ్యునల్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై కేటీఆర్‌ అనుయాయులు హైకోర్టును ఆశ్రయించగా స్టే లభించింది. ఆ తర్వాత కాలంలో 111 జీవోను రద్దు చేయడంతో దీనిపై పెద్దగా ఎవరూ దృష్టి సారించలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం కావడం.. హైడ్రాను ఏర్పాటు చేయటం, ఆ సంస్థ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుండటంతో మరోసారి జన్వాడ ఫాంహౌస్‌ చర్చల్లోకి వచ్చింది.

Updated Date - Aug 28 , 2024 | 03:13 AM