Mudunuri Satyavardhan: కొట్టి.. సంతకం చేయించారు
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:34 AM
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు పదేపదే ఫోన్లు చేసి బెదిరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను.

అఫిడవిట్‌లో ఏం రాశారో నాకు తెలియదు
కాగితాలపై ఉన్నదంతా వంశీ మనుషులు రాసిందే
10న రాత్రంతా వల్లభనేని వంశీ ఫ్లాట్‌లోనే ఉంచారు
కేసుతో సంబంధం లేదని కోర్టులో చెప్పించారు
సత్యవర్ధన్ వాంగ్మూలంలో ప్రధానాంశాలు
న్యాయస్థానం నుంచి కాపీని తీసుకున్న పోలీసులు
విజయవాడ, మార్చి 1(ఆంధ్రజ్యోతి):‘నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు పదేపదే ఫోన్లు చేసి బెదిరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాను. ఫోన్ చేసి నన్ను ఆయుష్ ఆస్పత్రి వద్దకు పిలిపించారు. అక్కడి నుంచి భీమవరపు యెతేంద్ర రామకృష్ణ, ఎర్రంశెట్టి రామకృష్ణ మరికొంతమంది నన్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని హనుమాన్ జంక్షన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఒక గదిలో బంధించి తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు. నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారు. నేను సంతకం చేసిన తర్వాత దానిపై వాళ్లే ఏదో రాసుకున్నారు’ అని ముదునూరి సత్యవర్ధన్ న్యాయాధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. బెదిరించి, దాడి చేయడంతోనే గతనెల 10న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టులో గన్నవరం కేసుతో సంబంధం లేదని చెప్పానని అంగీకరించినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాతే సత్యవర్ధన్ న్యాయాధికారి ముందు సీఆర్పీసీ 164 ప్రకారం వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కాపీని న్యాయస్థానం నుంచి పోలీసులు తీసుకున్నారు. ‘హనుమాన్‌జంక్షన్‌లో వేధింపులకు గురిచేయడంతో వారు చెప్పినట్టు చేశా. 10న ఎర్రంశెట్టి రామాంజనేయులు(తేలప్రోలు రాము) కారులో నన్ను విజయవాడలోని కోర్టుకు తీసుకొచ్చారు. ఆయుష్ ఆస్పత్రి నుంచి హనుమాన్ జంక్షన్‌కు యెతేంద్ర రామకృష్ణ, ఎర్రంశెట్టి రామకృష్ణ తీసుకెళ్లారు. అక్కడ కొమ్మా కోట్లు, ఘంటా వీర్రాజుతోపాటు మరికొంతమంది ఉన్నారు.
కోర్టుకు వచ్చిన తర్వాత వారు ఇచ్చిన కాగితాన్ని న్యాయాధికారికి ఇవ్వమని ఆదేశించారు. కోర్టులో ఈ పని పూర్తవ్వగానే ఏ మార్గంలో కిందికి దిగాలో వాళ్లే సూచించారు. కిందికి దిగగానే రామాంజనేయులు కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. కారును నేరుగా వంశీ నివాసం ఉంటున్న మైహోం భూజాకు తీసుకెళ్లారు. నేను పారిపోకుండా వంశీ అనుచరులంతా చుట్టుముట్టారు. లిఫ్ట్‌లో 11వ అంతస్తులో ఉన్న వంశీ ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. 10న రాత్రంతా వంశీ ఫ్లాట్‌లోనే ఉంచారు. మర్నాడు కారులో ఖమ్మం మీదుగా వైజాగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వంశీకి స్నేహితుడైన చేబ్రోలు శ్రీను గెస్ట్‌హౌస్‌లో బంధించి ఉంచారు’ అని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. కారులో హైదరాబాద్‌కు తీసుకెళ్లినప్పుడు వేలూరి వంశీబాబు ఉన్నాడని చెప్పినట్టు సమాచారం. ఆస్పత్రి తనను నుంచి కిడ్నాప్ చేయడంలో వంశీ ప్రధాన అనుచరులైన కొమ్మా కోట్లు, ఓలుపల్లి మోహనరంగారావు కీలకంగా పనిచేశారని న్యాయాధికారికి వాంగ్మూలం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.