AWARD: పురస్కారం సిగ్గుపడేలా..!
ABN , Publish Date - Jan 27 , 2025 | 11:59 PM
విద్యార్థులను పస్తులుంచి.. సస్పెండైన చెన్నేకొత్తపల్లి బీసీ బాలుర వసతిగృహం వార్డెన నారాయణస్వామి.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలలో ‘ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్’గా పురస్కారం అందుకున్నారు.

చెన్నేకొత్తపల్లి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను పస్తులుంచి.. సస్పెండైన చెన్నేకొత్తపల్లి బీసీ బాలుర వసతిగృహం వార్డెన నారాయణస్వామి.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాలలో ‘ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్’గా పురస్కారం అందుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో గణతంత్ర పురస్కారాలను అందుకు అతితక్కువ మంది వార్డెనలలో నారాయణస్వామి ఒకరు. ఆదివారం ఉదయం పురస్కారం అందుకున్న ఆయన.. సాయంత్రానికి సస్పెండ్ అయ్యారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదని తెలిసి హాస్టల్‌కు వెళ్లిన ఆర్డీఓకు స్థానికులు పలు ఫిర్యాదులు చేశారు. విధి నిర్వహణలో వార్డెన నిర్లక్ష్యంగా ఉంటారని, మద్యం సేవించి వస్తారని వివరించారు. పురస్కారాల జాబితాలో చేర్చే సమయంలో కనీస వివరాలు సేకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఎవరికిపడితే వారికి..
ప్రజలకు మెరుగైన సేవలు అందించేవారు, నిజాయితీగల అ ధికారులను గౌరవించేందుకు గణతంత్ర వేడుకలలో ప్ర భుత్వం పురస్కారాలను అందజేస్తుంది. కానీ పురస్కారాల ఎంపిక ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. నీతి, నిజాయితీతో సంబంధం లేదు. విధి నిర్వహణలో చిత్తశుద్ధి అవసరం లేదు. సిఫార్సు ఉంటే చాలు.. జాబితాలో చేరిపోవచ్చు. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వచ్చిన జాబితాను గుడ్డిగా ఆమోదిస్తున్నారు. పద్ధతిగా పనిచేసే అధికారులు, ఉద్యోగులను వేళ్లమీద లెక్కబెట్టవచ్చు. కానీ గణతంత్ర వేడుకలలో పురస్కారాలు అందుకునేవారు వందల్లో ఉంటున్నారు. నిజాయితీగా పనిచేసి పురస్కారం దక్కించుకున్నవా రు. తమతోపటుఉ అసమర్థులు, అవినీతిపరులు కూడా పురస్కారం అందుకోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు. ఇలా ఎవరికిపడితే వారికి పురస్కారాలు అందించే ఆలోచన ఉంటే.. తమలాంటివారికి ఇవ్వకపోతేనే మంచిదని అంటున్నారు. ‘మరకల’ సరసన నిలబడేందుకు అసౌకర్యంగా ఉందని అంటున్నారు.