AP Govt: పునుగు పిల్లుల సంరక్షణకు ప్రత్యేక నిర్మాణాలు
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:41 AM
అరుదైన పునుగుపిల్లుల జాతి సంరక్షణ, వాటి విశిష్టత వ్యాప్తి కోసం టీటీడీ ఖర్చుపెట్టనున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

1.97 కోట్ల టీటీడీ నిధుల వ్యయానికి ప్రభుత్వం అంగీకారం
ఎస్వీ జూలో ఎన్‌క్లోజర్ అభివృద్ధి
పునుగు పిల్లుల ప్రత్యేకత తెలిపేలా బోర్డులు
తిరుమల, మార్చి17(ఆంధ్రజ్యోతి): అరుదైన పునుగుపిల్లుల జాతి సంరక్షణ, వాటి విశిష్టత వ్యాప్తి కోసం టీటీడీ ఖర్చుపెట్టనున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేవదాయశాఖ సెక్రటరీ వినయ్‌చంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలేశుడికి నిర్వహించే సేవల్లో అత్యంత పవిత్రమైన అభిషేక సేవలో వినియోగించే పునుగుపిల్లి తైలం కోసం ఆ జాతి సంరక్షణ చర్యలు మరింత పకడ్బందీగా చేయాలని టీటీడీ ఆలోచన చేసింది. గతంలో శ్రీవారి కైంకర్యంలో వాడే పునుగుపిల్లుల తైలాన్ని సేకరించేందుకు వీటిని అర్చకులే తమ నివాసాల్లో పెంచేవారు. కాలం మారేకొద్దీ వాటి సంరక్షణ కష్టతరంగా మారిపోవడంతో తిరుపతి ఎస్వీ గోశాలకు వాటిని తరలించారు. అక్కడ కూడా వాటి సంఖ్య తగ్గిపోవడాన్ని గుర్తించి వాటి సంరక్షణ బాధ్యతలను ఎస్వీ జూకు అప్పగించారు. ప్రస్తుతం వాటి సంరక్షణ మరింత మెరుగ్గా నిర్వహించాలని టీటీడీ భావించింది. దీని కోసం కొన్ని ప్రత్యేక నిర్మాణాలను చేపట్టేందుకు గతేడాది డిసెంబరులో ధర్మకర్తల మండలి తీర్మానించింది. జూలో పునుగు పిల్లులను ఉంచిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అవి ఇష్టపడే, సౌకర్యవంతంగా జీవించే గుహలు వంటి నిర్మాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అలాగే పునుగు పిల్లుల విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలిపేలా బోర్డులు, వాటి బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలు, పునుగు పిల్లుల పెరుగుదలకు ఆటంకం కలిగించే గబ్బిలాల నుంచి రక్షించే గబ్బిలం ట్రాప్‌బోన్లు, బయటి వాతావరణం నుంచి రక్షణ కల్పించేలా అద్దాల నిర్మాణాల వంటి వాటిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనికోసం నిబంధనల ప్రకారం ఇప్పటికే సెంట్రల్ జూ అథారిటీ నుంచి కూడా అనుమతులు పొందారు. ఈ ప్రత్యేక నిర్మాణాల కోసం చెన్నైకు చెందిన హెచ్‌పీఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ రూ. 1.97 కోట్లతో కొటేషన్ వేసింది. దీనికి ఆమోదం కోసం టీటీడీ ప్రభుత్వానికి లేఖ పంపింది. ఈక్రమంలోనే నిధుల వ్యయానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి.