Share News

manyam Development ‘మన్యం’ అభివృద్ధే లక్ష్యంగా..

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:01 AM

Focused on manyam Development పార్వతీపురం మన్యం జిల్లా పేరుకే అన్న చందంగా మారింది. జిల్లావాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మన్యం’ ప్రగతికి చర్యలు చేపట్టింది.

  manyam  Development ‘మన్యం’ అభివృద్ధే లక్ష్యంగా..
పార్వతీపురం మండలంలో ములగ-తేలునాయుడువలస వరకు పూర్తయిన బీటీ రోడ్డు నిర్మాణం

  • ఉపాధి మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు మంజూరు

  • రూ. 208 కోట్లతో పనులకు శ్రీకారం

పార్వతీపురం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు ప్రభుత్వం ఎంతో హడావుడిగా జిల్లాలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతులపై మాత్రం దృష్టి సారించలేదు. అభివృద్ధి పనులనూ చేపట్టలేదు. కేంద్ర సర్కారు నిధులను సైతం పక్కదారి పట్టించింది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా పేరుకే అన్న చందంగా మారింది. జిల్లావాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ‘మన్యం’ ప్రగతికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద పలు పనులు చేపట్టేందుకు భారీగా నిధులు మంజూరు చేసింది.

ఇదీ పరిస్థితి..

- జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ. 208 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ, బీటీ రహదారులు, కాలువలు, గోశాలలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.174 కోట్లతో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో రూ. 34 కోట్లతో ప్రారంభించిన పనులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి కానున్నాయని సంబంధిత అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

- మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో జోరుగా అభివృద్ధి పనులు సాగుతుండడంతో జిల్లాలో ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. మరోవైపు ఇసుక కూడా ఉచితంగానే లభిస్తుండడంతో పలుచోట్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో తాపీమేస్ర్తిలు, కూలీలు, కళాసీలు, ఇటుకలు తయారీ చేసేవారికి చేతినిండా పని దొరుకుతోంది. ఇక సిమెంట్‌, ఐరెన్‌ దుకాణాలు కూడా కళకళలాడుతున్నాయి.

స్థానికంగానే ఉపాధి..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక లభ్యం కాకపోవడంతో భవన నిర్మాణ కార్మికులమంతా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఉపాధి లేక పస్తులున్నాం చివరకు ఇతర పనులకు వెళ్లిపోయాం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ చొరవతో గ్రామాల్లోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్థానికంగానే మాకు ఉపాధి లభిస్తుంది. ఎంతో ఆనందంగా ఉంది.

- తిరుపతినాయుడు, తాపీమేస్ర్తి పార్వతీపురం

===============================

ఇబ్బంది లేదు

గతంలో ఇసుక లభ్యం కాకపోవడంతో అభివృద్ధి పనులు జరిగేవి కాదు. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం వల్ల మాలాంటి ట్రాక్టర్‌ యజమానులతో పాటు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేసే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. దీంతో జీవనానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. గతంలో పోల్చుకుంటే స్థానికంగానే మాకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

అప్పలనాయుడు, ట్రాక్టర్‌ యజమాని, పార్వతీపురం

Updated Date - Mar 19 , 2025 | 12:01 AM