AP Government : ఆశాలకు వరం
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:04 AM
ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా..

రిటైర్మెంట్ తర్వాత రూ.1.5 లక్షల గ్రాట్యుటీ
42,752 మందికి నేరుగా ప్రయోజనం
పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
ప్రసూతి సెలవుల కాలంలో వేతనాలూ..
మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం
ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయం
మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం: మంత్రి సత్యకుమార్
అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు ఎప్పటినుంచో కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా వివిధ రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతివారూ గ్రాట్యుటీకీ అర్హులవుతారు. వారికి రిటైర్మెంట్ తర్వాత రూ.1.50 లక్షలకు వరకూ లబ్ధి చేకూరుతుంది. అలాగే, ఆశా వర్కర్ల పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. ఈ వరుస నిర్ణయాలతో గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే 37,017 మందికి, పట్టణ ప్రాంతంలో పని చేసే 5735 మందికి లబ్ధి చేకూరనుంది. ఆరోగ్యశాఖపై శనివారం జరిగిన సమీక్షలో భాగంగా చంద్రబాబు ఈ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్టయింది. పైగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. నిజానికి, గ్రాట్యూటీ అమలు చేయాలని ఆశాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆశా వర్కర్లకు గతంలో ప్రసూతి సెలవుల సమయంలో వేతన చెల్లింపు ఉండేది కాదు. ప్రసూతి సెలవులను పని దినాలుగా పరిగణనలోకి తీసుకుని వేతనం చెల్లించాలని అధికారులకు సమావేశంలో సీఎం ఆదేశాలు జారీచేశారు.
ఆశాలకు అండగా... ఆశాల పట్ల సీఎం చంద్రబాబు తొలినుంచీ సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఆశాలు అందిస్తున్న సేవలను మెరుగుపరచడం కోసం 2018లో ఆయన హయాంలోనే స్మార్ట్ ఫోన్‌లను అందించారు. ఎఎన్‌ఎంల నియామకంలో అర్హతను బట్టి ఆశా వర్కర్లకు అప్పట్లో అవకాశం ఇచ్చారు. రేషన్ కార్డు అందించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్యం పొందే అవకాశం కల్పించారు. ఉద్యోగ విరమణ వయస్సును అప్పట్లో 60 ఏళ్లకు పెంచిన ఆయన.. తిరిగి ఇప్పుడు దానిని 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు ఆశాలకు అర్హత కల్పించారు. నెలకు రూ.10 వేలు చొప్పున జీతం చెల్లిస్తున్నారు. వీరికి ఉత్తరప్రదేశ్‌లో రూ.750, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.2 వేలు, రాజస్థాన్‌లో రూ.2,700, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో రూ.మూడు వేలు, హరియాణా, కర్ణాటకలో రూ.4 వేలు, కేరళలో రూ.5 వేలు, తెలంగాణలో రూ.7,500 చొప్పున ఇస్తున్నారు. కాగా, ఆశా వర్కర్ల పదవీవిరమణ వయసును పెంచుతూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ హర్షించారు. ఈ నిర్ణయం ఆరోగ్య రంగంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆశా వర్కర్లకు గ్రాట్యూటీని అందిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రా నిలవనున్నదని తెలిపారు.