Share News

AP Mining Corporation : గనుల శాఖకు ‘గండి’

ABN , Publish Date - Jan 06 , 2025 | 05:07 AM

రాష్ట్ర ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కొందరు వైసీపీ నేతలకు పాడిఆవుగా మారింది. వైసీపీ అధినేత జగన్‌ అండతో ఎండీసీ నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.

AP Mining Corporation : గనుల శాఖకు ‘గండి’

  • ఆదాయం మింగుతున్న కడప నేతలు

  • మరో నేత రూ.35 కోట్ల ఎగవేత

  • 20 వేల టన్నుల ఏ గ్రేడ్‌ బెరైటీస్‌కూ చెల్లింపులు చేయని వైనం

  • ఎనిమిదేళ్లుగా అధికారుల చోద్యం

  • కాగ్‌ ఆదేశించినా చర్యల్లేవు

  • మొత్తం బకాయిలు రూ.600 కోట్లు

  • ఒక్క కడప జిల్లా నేతలవే 280 కోట్లు

  • దృష్టి సారించని కూటమి సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చే ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కొందరు వైసీపీ నేతలకు పాడిఆవుగా మారింది. వైసీపీ అధినేత జగన్‌ అండతో ఎండీసీ నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇటు అప్పులు పెట్టడం, అటు బెరైటీస్‌ను తరలించుకుపోవడం.. ఇలా వారికి నచ్చినట్లుగా సంస్థను వాడుకుంటున్నారు. కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత 2008 నుంచి ఎండీసీకి 50 కోట్లు అప్పు చెల్లించని విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కడప జిల్లాకే చెందిన మరో వైసీపీ నేత ఎండీసీని అలాగే వాడుకొని పంగనామాలు పెట్టారు. నాటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈ నేత 35 కోట్ల రూపాయల మేర ఎండీసీకి అప్పు పెట్టారు. 2016 నుంచి నేటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. ఇది చాలదన్నట్లుగా 20 వేల టన్నుల ఏ గ్రేడ్‌ బెరైటీస్‌ను క్రెడిట్‌ పాలసీ కింద తీసుకెళ్లారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎండీసీకి చెల్లింపులు చేయలేదు.


గత ఏడాది మార్చిలో కాగ్‌ ఈ అంశాన్ని పరిశీలించి ఆ నేతకు రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) నోటీసులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గనుల శాఖ మంత్రి, ఓ అధికారికి సన్నిహితుడు కావడంతో నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సాహసించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ నేత హవానే సాగుతోంది. సదరు వైసీపీ నేతకు చెందిన బెరైటీస్‌ బెనిఫిసియేషన్‌ ప్లాంటుకు 2016-22 కాలంలో ఎండీసీ భారీగా ఏ గ్రేడ్‌ బెరైటీస్‌ను సరఫరా చేసింది. నిబంధనల ప్రకారం భారీగా అప్పు పెట్టిన కంపెనీకి బెరైటీస్‌ను సరఫరా చేయడానికి వీల్లేదు.

ఎండీసీతో బెనిఫిసియేషన్‌ ఒప్పందం ఉన్నా ఈ నియమం వర్తిస్తుంది. 2016 వరకు సమయానుగుణంగా బకాయిలు తీర్చిన ఆ నేత కంపెనీ ఆ తర్వాత చేతులెత్తేసింది. రూ.35 కోట్ల మేర విలువైన బెరైటీస్‌ను ఎండీసీ నుంచి తీసుకుని, ఈ మొత్తం తిరిగి చెల్లించలేదు. ఒక ఏడాది బకాయి ఉంటేనే వడ్డీతో సహా అపరాధ రుసుము వసూలు చేస్తారు. అలాంటిది.. 2016 నుంచి 35 కోట్ల అప్పు, దానికి వడ్డీ, అపరాధ రుసుము కలిపితే చాలా మొత్తం అవుతుంది. అలాగే జగన్‌ ప్రభుత్వంలో ఎండీసీ నుంచి తరలించుకుపోయిన 25 వేల టన్నుల ఏ గ్రేడ్‌ బెరైటీస్‌కూ సదరు నేత కంపెనీ బిల్లులు చెల్లించాల్సి ఉంది.


బకాయిల వసూళ్లకు నోటీసులు ఇవ్వకుండా తాత్సారం చేసినందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది మార్చిలో కాగ్‌ సిఫారసు చేసింది. అయితే జగన్‌ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది. కొత్త ప్రాజెక్టుల నిర్వహణ కోసం 5 వేల కోట్ల అప్పులు తెచ్చేందుకు ఎండీసీ రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఎండీసీకి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీటిపై దృష్టిసారిస్తే పాత పద్దుల కింద కనీసం 600 కోట్ల మేర వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలే ఏపీఎండీసీకి దాదాపు రూ.280 కోట్ల వరకూ బకాయిలు చెల్సించాల్సి ఉంది. బకాయిల వసూళ్లపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికార వర్గాలు కోరుతున్నాయి.

Updated Date - Jan 06 , 2025 | 05:08 AM