NITI Aayog Report : జగన్ హయాంలో ఆంధ్రా విలవిల!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:12 AM
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తీవ్రమైన ఆర్థిక లోటు, అతి తక్కువ మూలధన వ్యయం, భారీ అప్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్...

ఆర్థికంగా కునారిల్లిందంటూ నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి
తీవ్ర ఆర్థిక లోటు.. భారీగా అప్పులు
అతి తక్కువ మూలధన వ్యయం
ఘోరంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్
ఆర్థిక ఆరోగ్య సూచీలో 17వ స్థానం
అప్పుల చెల్లింపు సామర్థ్యం సున్నా
రాష్ట్రానికి ఆర్థిక చేయూత అవసరం
ఇప్పటికైనా మూలధన వ్యయ సామర్థ్యాన్ని ఏపీ పెంచుకోవాలి
ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచన
ఆర్థికంగా బలమైన రాష్ట్రాల్లో ఒడిశా ఫస్ట్.. తెలంగాణకు 8వ స్థానం
న్యూఢిల్లీ/అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తీవ్రమైన ఆర్థిక లోటు, అతి తక్కువ మూలధన వ్యయం, భారీ అప్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కునారిల్లిందని నీతి ఆయోగ్ ‘ఆర్థిక ఆరోగ్య సూచిక-2025’ వెల్లడించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగాఢియా శుక్రవారం ఢిల్లీలో ఈ నివేదిక విడుదల చేశారు. ఇప్పటికైనా మూలధన వ్యయ సామర్థ్యాన్ని రాష్ట్రం పెంచుకోవాలని, ఖర్చులు సమర్థంగా నిర్వహించాలని, కట్టుదిట్టమైన ఆర్థిక క్రమశిక్షణతో వనరులను పెంచుకోవాలని నీతి ఆయోగ్ అందులో సూచించింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో సొంత వనరుల పెరుగుదల శాతం 2018-19లో 17.1 శాతం కాగా.. 2022-23 నాటికి కేవలం 9.8 శాతానికి తగ్గిపోయింది. గత ఐదేళ్లలో రాష్ట్రం నిరంతరం ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు ఎదుర్కొంది. తరచూ ఎఫ్‌ఆర్‌బీఎం లక్ష్యాలను సాధించాలని హెచ్చరించాల్సి వచ్చింది. ప్రభుత్వ రుణం గత ఐదేళ్లలో సగటున 16.5 శాతం మేరకు పెరుగుతూ వచ్చింది. 2022-23లో వడ్డీ చెల్లింపులు 15 శాతం పెరిగాయి. రెవెన్యూ వసూళ్లకు వడ్డీ చెల్లింపులు కూడా పెరుగుతూ వచ్చాయి’ అని తెలిపింది. 2022-23లో ఆరోగ్య సౌకర్యాలు, సమస్యల పరంగా ఏపీ అత్యంత దయనీయస్థితిలో ఉందని వెల్లడించింది. ఏపీ, హరియాణా, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ గట్టి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్న నీతి ఆయోగ్.. ఈ రాష్ట్రాలకు పెద్దఎత్తున చేయూత ఇవ్వాలని పేర్కొంది. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటి ర్యాంకు సాధించగా.. తెలంగాణకు ఎనిమిదో స్థానం, ఆంధ్రప్రదేశ్‌కు 17వ స్థానం దక్కాయి.
జీడీపీలో వాటా, జనాభా, మొత్తం ప్రభుత్వ వ్యయం, ఆదాయాలు, ఆర్థిక సుస్థిరత ఆధారంగా నీతిఆయోగ్ ఈ సూచికను రూపొందించింది. అతితక్కువ ఆర్థిక లోటు, వనరుల సమీకరణ, అతితక్కువ రుణాలు, సగటుకు మించి మూలధన వ్యయం.. ఇలా అన్ని అంశాల్లో ఒడిశా మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, యూపీ.. మొత్తం అభివృద్ధి వ్యయంలో 27 శాతం మేర మూల ధన వ్యయానికి కేటాయిస్తే.. ఆంధ్ర కేవలం 3.5 శాతం కేటాయించిందని.. అప్పుల్లోనూ మూలధన వ్యయానికి 4.4 శాతమే ఖర్చుచేసిందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఒడిశా ఆర్థిక ఆరోగ్య సూచిక స్కోరు 67.8 కాగా.. ఛత్తీస్‌గఢ్-55.2, గోవా-53.6, జార్ఖండ్-51.6, గుజరాత్-50.5, మహారాష్ట్ర-50.3, యూపీ-45.9, తెలంగాణ 43.6 స్కోరును సాధించాయి. ఆంధ్ర స్కోరు 20.9 మాత్రమే. ద్రవ్యలోటులో ఏపీ అగ్రస్థానంలో ఉండడం నాటి రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనం. 2022-23లో రెవెన్యూ సమీకరణలో ఏపీ 22.1 పాయింట్లు సాధించగా.. అప్పుల సూచీలో 37.8, అప్పుల చెల్లింపు సామర్థ్యంలో సున్నా పాయింట్లు వచ్చాయి. నాణ్యమైన ఖర్చుల్లో 15వ ర్యాంకు, ఆదాయ సమీకరణలో 16వ ర్యాంకు, నమ్మకమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో 16వ ర్యాంకు, అప్పులు తేవడంలో 12వ ర్యాంకు వచ్చాయి.