Share News

బంగారం దోపిడీ కేసులో మరో ఐదుగురు అరెస్టు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:25 AM

ఆంధ్రా - తమిళనాడు రాష్ర్టాల సరిహద్దులోని నాయకనేరి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన బంగారం దోపిడీ కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ డి. ప్రభాకర్‌, సీఐ సోమశేఖర్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం వి.కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కన్పించిన వారిని విచారించగా వారు బంగారం దోపిడీ కేసులో నిందితులుగా తేలడంతో అరెస్టు చేశామన్నారు

బంగారం దోపిడీ కేసులో మరో ఐదుగురు అరెస్టు
బంగారం దోపిడీ కేసులో నిందితులను అరెస్టు చూపుతున్న పోలీసులు

వి.కోట, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా - తమిళనాడు రాష్ర్టాల సరిహద్దులోని నాయకనేరి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన బంగారం దోపిడీ కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ డి. ప్రభాకర్‌, సీఐ సోమశేఖర్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం వి.కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కన్పించిన వారిని విచారించగా వారు బంగారం దోపిడీ కేసులో నిందితులుగా తేలడంతో అరెస్టు చేశామన్నారు. వారిలో తమిళనాడు రాష్ట్రం పేర్నాంబట్‌ సమీపంలోని కల్లిపేటకు చెందిన వేదాచలం(44), కుమరేశన్‌ (39), రంజిత్‌ (35), దీపన్‌ చక్రవర్తి (42), సూరవేల్‌ (48)వున్నారన్నారు.ఈ నెల 2వ తేది రాత్రి 8.45 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్‌కు చెందిన దీపక్‌ కుమార్‌ అనే మార్వాడి వద్ద పనిచేసే చేతన్‌ కారులో బంగారం తీసుకెళ్తుండగా డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు అంతర్రాష్ట్ర ముఠా అడవిలో దారి కాచి కత్తులతో బెదిరించి కారులో ఉన్న బంగారాన్ని దోచుకెళ్ళిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన ముద్దాయిలైన కేజీఎఫ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత సయపాల్‌తో పాటు కారు డ్రైవర్‌ ముకరం, బాబు, షణ్ముగంలను అరెస్టు చేసి వారి వద్ద రూ. 3.2 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారం కడ్డీలను రికవరీ చేశామన్నారు.తాజాగా ఐదుగురిని అరెస్టు చేశామని, మిగిలిన నలుగురి కోసం అన్వేషిస్తున్నామని డీఎస్పీ ప్రభాకర్‌ తెలిపారు. దోపిడీ కేసులో తాజాగా అరెస్టయిన నిందితులను పలమనేరు కోర్టుకు తరలిస్తుండగా వారి బంధువులు మాట్లాడేందుకు ఎగబడ్డారు. అయితే పోలీసులు వారిని వారించి నిందితులను కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుషియల్‌ రిమాండు విధించారు. దీంతో నిందితులను మదనపల్లె జైలుకు తరలించారు.

స్నేహితుల వల్లే కేసులో ఇరుకున్నా

బంగారం దోపిడీ కేసులో ముద్దాయిల్లో ఒకడైన అప్పు (28) తన స్వగ్రామమైన తమిళనాడు రాష్ట్రం పేర్నాంబట్‌ సమీపంలోని గుండ్లపల్లె వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం గ్రామ స్తులు గమనించి సమాచారమివ్వడంతో కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని కిందకు దించారు. స్నేహితులు తనను సరదాగా తీసుకువెళ్ళి దోపిడీ కేసులో ఇరికించారని, తన చావుకు వారే కారణమంటూ అతని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఆడియో బయటపడింది. తమ బిడ్డ మృతికి కారణమైన స్నేహితులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు డిమాండు చేశారు. ఈ కేసులో 8వ ముద్దాయిగా ఉన్న అప్పు ఆత్మహత్య విషయాన్ని డీఎస్పీ ప్రభాకర్‌ వద్ద ప్రస్తావించగా అప్పు ఈ దోపిడీలో పాల్పంచుకున్నాడు కాబట్టే ముద్దాయిగా చేర్చామన్నారు. అతడి ఆత్మహత్యతో తమకు సంబంధం లేదన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:25 AM