హంతకులను వదిలిపెట్టం
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:57 AM
‘హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ధైర్యంగా ఉండండి’ అని వైసీపీ కార్యకర్త వెంకట్రమణ చేతిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబీకులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

వైసీపీ కార్యకర్త చేతిలో హత్యకు గురైన రామకృష్ణ కుటుంబీకులకు సీఎం హామీ
అశ్రునయనాల మధ్య టీడీపీ కార్యకర్త అంత్యక్రియలు
పుంగనూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ‘హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ధైర్యంగా ఉండండి’ అని వైసీపీ కార్యకర్త వెంకట్రమణ చేతిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబీకులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త కాగతి రామకృష్ణను వేటకొడవలితో వైసీపీ కార్యకర్త వెంకట్రమణ కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నుంచి రామకృష్ణ మృతదేహాన్ని స్వగృహానికి తరలించి ఆదివారం ఉదయం 12 గంటలకు అంత్యకియ్రలు చేయాల్సి ఉంది. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా వచ్చి రామకృష్ణ మృతదేహంపై టీడీపీ జెండా కప్పబోగా కుటుంబీకులు నిరాకరించారు. తమకు న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదన్నారు. కేవలం టీడీపీలో ఉన్నామన్న కారణంతోనే వైసీపీ ప్రభుత్వంలో తమ ఇంటిళ్లపాదీ వైసీపీ కార్యకర్తల చేతిలో దాడులు, అక్రమ కేసులు, దెబ్బలు తింటూ భరిస్తూ వచ్చామన్నారు. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా తప్పులు చేయకపోయినా తామే కేసులు, దెబ్బలు తింటున్నామని, కుటుంబ పెద్దను కూడా కోల్పోయామని వాపోయారు. బాధితులుగా పోలీస్ స్టేషన్‌కు వెళితే పుంగనూరు సీఐ శ్రీనివాసులు తమనే తిట్టేవారని రామకృష్ణ భార్య దేవమ్మ, కుమారులు శివ, సురేశ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రభుత్వంలోనూ న్యాయం జరగకపోతే ఏమి చేయాలని ప్రశ్నించారు. చల్లా వెంటనే సీఎంకు ఫోన్ చేసి.. కుటుంబీకులతో మాట్లాడించారు. ‘రామకృష్ణ హత్య దురదృష్టకరం. టీడీపీ అండగా ఉంటుంది. ఆందోళన చెందొద్దు. త్వరలోనే మంత్రులు, పార్టీ పెద్దలు మిమ్మల్ని కలుస్తారు. అంత్యక్రియలు చేయండి’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిలతోనూ రామకృష్ణ కుమారులు శివ, సురేశ్‌లతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు చల్లా బాబు, షాజహాన్‌బాషాలు చిత్తూరు ఎస్పీ మణికంఠ, పలమనేరు డీఎస్పీ ప్రభాకర్‌లతో హంతకుల అరెస్టుపై మాట్లాడారు. పుంగనూరు, చౌడేపల్లె, మదనపల్లె తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి అశ్రునయనాల మధ్య రామకృష్ణ అంత్యక్రియలు మధ్యాహ్నం మూడు గంటలకు పూర్తిచేశారు. ఇక రామకృష్ణ హత్య తెలిసిన వెంటనే శనివారం పలువురు ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు మదనపల్లె ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. అయితే ఆదివారం పార్టీ అధినాయకులు, మంత్రులు రాకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించింది. టీడీపీ నాయకులు మాధవరెడ్డి, గంగాధర్, రాఘవ, రవికుమార్, సుబ్రహ్మణ్యంరాజు, ప్రసాద్‌స్వామి, పగడాల రమణ, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాపురంలో కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్
రామకృష్ణ హత్య సందర్భంగా కృష్ణాపురంలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. డీఎస్పీ ప్రభాకర్, సీఐ రాంభూపాల్‌రెడ్డి గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తును పరిశీలించారు.
పుంగనూరులో పెద్దిరెడ్డి ఆటలు సాగనివ్వం
- అమరావతికి 15 రోజుల్లో రావాలంటూ చల్లాకు చంద్రబాబు సూచన
పుంగనూరులో ఇకపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆటలు సాగవని, టీడీపీ శ్రేణులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు చెప్పారు. రామకృష్ణ కుటుంబంతో మాట్లాడాక చల్లాతో 10 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. అసెంబ్లీ తర్వాత 15 రోజుల్లో అమరావతికి రావాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అరాచకాలు అడ్డుకుంటూ.. పార్టీ శ్రేణుల సమస్యలపై చర్చించాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తవహించాలని చెప్పారు. మూడ్రోజుల్లో మంత్రులు పుంగనూరుకు వస్తారని, రామకృష్ణను చంపినవారికి చట్టప్రకారం శిక్షపడేలా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ.. గతంలో దాదాపు 700 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ నేతలు అక్రమంగా 307 కేసులను పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. ఈ కేసులను ఎత్తివేయాలని, కార్యకర్తలు మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారని సీఎంతో అన్నారు.
రామకృష్ణ మృతి టీడీపీకి తీరని లోటు
టీడీపీ కార్యకర్త రామకృష్ణ మృతి టీడీపీకి తీరని లోటని చల్లా రామచంద్రారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. వారు కృష్ణాపురంలో మాట్లాడుతూ.. రామకృష్ణ ఎన్నికల సమయంలో పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. రామకృష్ణ కుటుంబంపై ఇప్పటికే మూడు సార్లు దాడులు చేసినా పోలీసులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. హంతకుడు వెంకట్రమణతోపాటు అతడికి సహాకరించిన వారు ఎంతటివారైనా వదలిపెట్టేది లేదని హెచ్చరించారు. సీఐ శ్రీనివాసులు సకాలంలో స్పందించి ఉంటే రామకృష్ణ ప్రాణాలు పోయేవి కావన్నారు. సీఐని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పది కిలోమీటర్లు దూరంలో మదనపల్లె ఉందని మీకు ఏ ఇబ్బంది ఉన్నా తనవద్దకు రావాలని టీడీపీ శ్రేణులతో షాజహాన్ అన్నారు.
త్వరలోనే హంతకులను పట్టుకుంటాం: డీఎస్పీ
రామకృష్ణ హత్యకు కారకులైన హంతకులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీసీ పుటేజీ, సెల్ ఫోన్ ట్రాకింగ్, సాంకేతిక ఆధారాలు అన్నింటిపై దృష్టి పెట్టామని చెప్పారు. సీఐను సస్పెండ్ చేశామని, ఈకేసుపై విచారణ జరుగుతోందన్నారు. ఆయన వెంట పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్, పుంగనూరు, చౌడేపల్లె, సోమల, గంగవరం, పలమనేరు ప్రాంతాల నుంచి భారీగా పోలీసులు కృష్ణాపురానికి చేరుకున్నారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ పుంగనూరు చేరుకుని కృష్ణాపురంలో జరిగే ప్రతి విషయాన్ని పలమనేరు డీఎస్పీ ద్వారా తెలుసుకున్నారు.
పోలీసుల నిర్లక్ష్యంతోనే రామకృష్ణ హత్య
ఫ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రకుమార్
చిత్తూరు సిటీ: పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే పుంగనూరులో రామకృష్ణ హత్యకు గురయ్యారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రకుమార్ ఆరోపించారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యనేనని చెప్పారు. నిందితుడు వెంకట్రమణ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడన్నారు. వెంకట్రమణ తదితరులు గతంలో దాడిచేశారని, రక్షణ కల్పించాలని రామకృష్ణ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం మారినా కొంతమంది పోలీసు అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు.