Share News

వైసీపీ ముసుగు తీయండి

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:45 AM

‘కొన్ని పోలీస్‌ స్టేషన్లు ఇప్పటికీ వైసీపీ ముసుగు కప్పుకుని ఉన్నాయి. కొందరు అధికారులు వైసీపీ నేతలతో అంటకాగుతున్నారు. ఇప్పటికే అధినాయకుడి దృష్టికి వారి జాబితా వెళ్లింది. అలాంటివారిని ఉపేక్షించేదిలేదు’ అని శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు హెచ్చరించారు.

వైసీపీ ముసుగు తీయండి
సన్మానం అందుకుంటున్న కూటమి నేతలు

వారితో అంటకాగితే స్థాన చలనం తప్పదు

పోలీసులకు శాప్‌ చైర్మన్‌ హెచ్చరిక

తిరుపతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ‘కొన్ని పోలీస్‌ స్టేషన్లు ఇప్పటికీ వైసీపీ ముసుగు కప్పుకుని ఉన్నాయి. కొందరు అధికారులు వైసీపీ నేతలతో అంటకాగుతున్నారు. ఇప్పటికే అధినాయకుడి దృష్టికి వారి జాబితా వెళ్లింది. అలాంటివారిని ఉపేక్షించేదిలేదు’ అని శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు హెచ్చరించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన కూటమి నాయకుల సన్మాన కార్యక్రమంలో రవినాయుడు మాట్లాడారు. పార్టీ అధికారంలో ఉండి కూడా కార్యకర్తలను పోగొట్టుకుంటున్నామంటే పోలీసుల అలసత్వమే కారణమన్నారు. ‘ప్రాణహాని ఉదంటూ పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ వీడియో పెట్టిన తర్వాత కూడా పోలీసులు చోద్యం చూశారు. అనంతరం ఆయన హత్యకు గురయ్యారు. ఇటీవల వైసీపీ నిర్వహించిన యువత పోరులో కొందరు కలెక్టరేట్‌ గేట్లు విరిచి, ఎన్‌హెచ్‌పై ట్రాఫిక్‌ ఇబ్బందులు కలిగిస్తే వారిని వదిలిపెట్టేశారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా వైసీపీ నేత అభినయ్‌ రెడ్డి అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో హల్‌చల్‌ చేస్తే కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. మా నాయకులపైన కేసులు పెట్టడం, సమస్యపైన వెళితే తాత్సారం చేయడంలో మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలు కాపాడే విషయంలో మూడు పార్టీలు ఒకే నిర్ణయంతో ఉన్నాయి’ అని రవినాయుడు అన్నారు.

కార్యకర్తల కష్టంతోనే మనకీ పదవులు

‘కూటమి’ నాయకులకు ఘన సన్మానం

‘గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంతో తలపడిన కూటమి కార్యకర్తల కష్టంతోనే మనకు ఈ పదవులు దక్కాయి. దశల వారీగా అందరికీ న్యాయం చేసేందుకు పార్టీ ముఖ్యులు సిద్ధంగా ఉన్నారు’ అని నాయకులు అన్నారు. నామినేటెడ్‌, పార్టీ పదవులు పొందిన కూటమి నేతలు.. శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌ నీలాయలపాలెం విజయకుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, టీటీడీ సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రుద్రకోటి సదాశివం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు కుమారమ్మ, కరాటే చంద్ర, బాలసుబ్రమణ్యంను ఆదివారం సత్కరించారు. ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వూకా విజయకుమార్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని నిర్మల రామయ్య కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. సన్మాన గ్రహీతలతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుగుణమ్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పసుపులేటి హరిప్రపాద్‌, టౌన్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ప్రసంగించారు. కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రనాధ్‌, నగర ప్రధాన కార్యదర్శి మహేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:45 AM

News Hub