TTD Board Decisions: తిరుమలలో ఈ రూల్స్ పాటించాల్సిందే.. టీటీడీ సంచలన నిర్ణయం
ABN, Publish Date - Mar 24 , 2025 | 04:58 PM
TTD Board Decisions: టీటీడీ పాలక మండలి ఈరోజు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి ఇవాళ(సోమవారం) సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను రూ.5258.68 కోట్లతో పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతో పాటు 15ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని.. ప్రత్యామ్నాయంగా 50ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవాణి ట్రస్టుతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే మరో ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఈ ఆలయాలను నిర్మిస్తామని అన్నారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం..ఇప్పటికే పలువురు సీఎంలు ఆలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. ఏపీలో పలు చోట్ల నిలిచిపొయిన దేవాలయాలను పునర్ నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా జీతం రూ.43 వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. సైన్స్ సిటీకి టీటీడీ కేటాయించిన 20 ఏకరాల స్థలాలను రద్దు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒక్కసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. లైసెన్స్ లేని హ్యాకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్‌లు ఏర్పాటుపై అధ్యయనం చేశామని తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు గతంలో మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సూచించామని చెప్పారు. తిరుపతి గంగమ్మ, తలకోన, కర్నూల్ జిల్లాలో బుగ్గ, అనకాపల్లిలోని ఉపమాక, ధర్మవరం, తెలంగాణలోని కొడంగల్, సికింద్రాబాద్, కరీంనగర్‌లలో నూతనంగా ఆలయాలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. 180 మంది కాంట్రాక్టు లెక్చరర్‌లకు జీత భత్యాల పెంపుపై కమిటీ వేశామని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు అఫ్‌లైన్‌లో టికెట్స్ జారీపై కమిటీ వేశామని అన్నారు. పాత ఆగమ సలహా మండలిని రద్దు చేశామని.. త్వరలోనే నూతన కమిటీని నియమిస్తామని స్పష్టం చేశారు. శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేశామని అన్నారు. గూగుల్ సంస్థ ద్వారా తిరుమల కార్యకలాపాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News
Updated Date - Mar 24 , 2025 | 05:48 PM