Share News

విద్యార్థులూ.. ఆల్‌ ది బెస్ట్‌

ABN , Publish Date - Mar 17 , 2025 | 01:39 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి 31వ తేది వరకు.. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు మొదలవుతాయి. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులూ.. ఆల్‌ ది బెస్ట్‌
పరీక్షా కేంద్రాల వద్ద హాల్‌టికెట్‌ నెంబర్లను చూసుకుంటున్న విద్యార్థులు

నేటి నుంచి ‘పది’ పరీక్షలు

తిరుపతి(విద్య/కలెక్టరేట్‌/నేరవిభాగం), మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి 31వ తేది వరకు.. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు మొదలవుతాయి. ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక, ఆదివారానికే పరీక్షా కేంద్రాలున్న తరగతి గదుల్లో డెస్కులపై హాల్‌టికెట్‌ నెంబర్లు వేశారు. ఆయా కేంద్రాల వద్ద బయట ఆయా హాల్‌టికెట్‌ నెంబర్ల ఆధారంగా కేటాయించిన తరగతి గదుల వివరాలతో నోటీసు బోర్డులు పెట్టారు. ఇక, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాల్‌టికెట్లలోని పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని నోటీసు బోర్డుల్లో తమ, తమ పిల్లల రూమ్‌ నంబర్లను నోట్‌ చేసుకున్నారు. లోపలకు అనుమతించిన కేంద్రాల్లో తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లి హాల్‌టికెట్‌ నంబర్ల ప్రకారం వారి స్థానాలను చూసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం చెప్పారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకుని, ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, తమ ఇళ్ల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లను చూపి పల్లె వెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని డీఈవో కేవీఎన్‌ కుమార్‌ తెలిపారు. స్వస్థలాల నుంచి, లేదా బస్టాండ్‌, రైల్వే స్టేషన్ల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇక, జిల్లా వ్యాప్తంగా 28,656 మంది విద్యార్థులు పరీక్షలు రాసే 164 కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఒక ప్రకటనలో తెలిపారు. 10 మొబైల్‌ పార్టీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:39 AM

News Hub