కబ్జాలో కాజూరు చెరువు!
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:50 AM
జాతీయ రహదారి పక్కనే ఆక్రమణపర్వం సప్లై ఛానళ్లనూ వదలని అక్రమార్కులు

చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన చిత్తూరు నగర శివారులో వున్న కాజూరు చెరువు కబ్జాకు గురవుతోంది. చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారి పక్కనే వున్న కారణంగా ఈ చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది.సప్లై ఛానళ్లను కూడా వదలకుండా ఆక్రమిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు నగరానికి తాగు, సాగునీరందించడానికి గంగినేని , కట్టమంచి , కాజూరు చెరువులుండేవి. వర్షాకాలంలో ఈ మూడు చెరువులు నిండితే నగరానికి తాగునీటితో పాటు కింద భాగంలో ఉన్న రైతుల భూములకు నీళ్లందేవి.అయితే సప్లై ఛానళ్లు దెబ్బతిని చెరువులకు నీళ్లొచ్చే మార్గాలు మూసుకుపోవడంతో చిత్తూరుకు నీటి సమస్య దాపురించింది.రికార్డుల్లో జడియం చెరువుగా, వాడుకలో కాజూరు చెరువుగా పిలిచే ఈ చెరువు సర్వే నెంబరు 159, 170లో సుమారు 200 ఎకరాల వరకు ఉంది. కాజూరు, ఇరువారం, కొండ ప్రాంతం, పోతంబట్టు ప్రాంతాల నుంచి ఏడు సప్లై ఛానళ్లు ఉండేవి. కాలక్రమేణా వీటిలో ఐదు ఛానళ్లను కబ్జాదారులు ఆక్రమించుకోవడంతో బలమైన వర్షం కురిసినా చెరువుకు నీళ్లు రావడం లేదు. అక్కడక్కడా పల్లపు ప్రాంతంలో మాత్రమే నీరు చేరుతోంది.చెరువు రోడ్డును ఆనుకుని ఉండడం.. రోజు రోజుకూ నగరం విస్తరించడంతో కబ్జాదారుల కన్ను కాజూరు చెరువుపై పడింది. తూర్పు భాగంలో ఉన్న కాజూరు కాలనీ వాసులు కూడా అటు వైపు నుంచి చెరువు స్థలంలో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. ఇటుపక్క రోడ్డును ఆనుకుని ఉన్న చెరువు భూముల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వ్యర్థాలను తోలి నింపి కొద్దికొద్దిగా చదును చేస్తూ వచ్చారు.ఇప్పటికే కబ్జాదారులు ఐదు ఎకరాల వరకు ఆక్రమించి మట్టిని తోలి చదును చేశారు. దాని పక్కనే ఓ వ్యక్తి వాహనాల షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు.ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 15 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన కబ్జాదారులు ఆక్రమించుకున్న భూముల ధర రూ. 75 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.కలెక్టర్ సహా ఉన్నతాధికారులు బంగారుపాళ్యం, పలమనేరు, కుప్పం వెళ్లాలంటే ఈ మార్గంలోనే వెళతారు.అయినా ఈ ఆక్రమణ వారి కంటికి కనపడకపోవడమే విచిత్రం.స్థానిక అధికారులకు కాజూరు చెరువు కబ్జా గురించి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు.