Share News

కుప్పం ‘పట్టు’లో ఇక ‘ఆటోమేటిక్‌’ అభివృద్ధి

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:30 AM

కుప్పం నియోజకవర్గంలోని పట్టు రైతులకు మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పట్టుగూళ్లకు, స్థానికంగానే విక్రయించి లాభాలు గడించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనియోజకవర్గానికి నాలుగు ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

కుప్పం ‘పట్టు’లో ఇక ‘ఆటోమేటిక్‌’ అభివృద్ధి
కార్యాలయ ఆవరణలో నడుస్తున్న ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రం

కుప్పం నియోజకవర్గంలోని పట్టు రైతులకు మంచి రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన పట్టుగూళ్లకు, స్థానికంగానే విక్రయించి లాభాలు గడించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనియోజకవర్గానికి నాలుగు ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

కుప్పం నియోజకవర్గం ఒకప్పుడు పట్టు పరిశ్రమకు పట్టుగొమ్మగా విలసిల్లేది. పట్టు రైతులకు వివిధ రకాలైన పథకాల ద్వారా సబ్సిడీలు లభించేవి. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాలతోపాటూ పట్టు పరిశ్రమకు కూడా సరైన ప్రోత్సాహకం కొరవడింది. పట్టు రైతులను పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. మళ్లీ 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతినుంచి కుప్పంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. పథకాలు తిరిగి మనుగడలోకి వచ్చి పట్టు రైతులు కోలుకుంటున్నారు. అయితే స్థానికంగా పట్టుగూళ్లనుంచి దారం తీసే రీలింగ్‌ యంత్రాల కొరత వల్ల ఉత్పత్తి అవుతున్న పట్టుగూళ్లను ఇతర ప్రాంతాలకు వెళ్లి విక్రయించుకోవాల్సి వస్తోంది. దీంతో పట్టు రైతులు కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ పరిధిలో బైవోల్టిన్‌ పట్గుగూళ్లు నెలకు సుమారు 150 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. సీబీ రకం కూడా ఉత్పత్తి అవుతున్నా వీటి శాతం చాలా తక్కువ. ఉత్పత్తి అయిన బైవోల్టిన్‌ పట్టుగూళ్లలో కేవలం 15 టన్నులు మాత్రమే కుప్పం మార్కెట్టులో రైతులు విక్రయించగలుగుతున్నారు. మిగిలిన గూళ్లను బెంగళూరు, పలమనేరు తదితర మార్కెట్లకు ఎన్నో కష్టనష్టాలకోర్చి తీసుకెళ్లాల్సి వస్తోంది. కాదంటే దళారులకు తెగనమ్మాల్సిన దుస్థితి రైతులది. పట్టుగూళ్లనుంచి పట్టు దారాన్ని వెలికితీసే ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాల కొరత వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది.

ప్రస్తుతం ఉన్నవి రెండు యంత్రాలే

కుప్పంలోని పట్టు పరిశ్రమ శాఖ ఏడీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాన్ని లీజుకు ఇచ్చి నడుపుతున్నారు. శాంతిపురంలో ఉన్నది మాత్రం ప్రైవేటు యంత్రం. ఇవి రెండూ 200 యాడ్స్‌ సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. అందువల్ల కుప్పంలో ఉత్పత్తి అవుతున్న పట్టు గూళ్లకు సరిపోవడంలేదు. ఈ సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి నియోకవర్గానికి నాలుగు ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలు మంజూరు చేయించారు. వీటికోసం దరఖాస్తులను పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ఆహ్వానించారు. పది మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ యంత్రాలు రెండు రకాలు. 200 యాడ్స్‌ సామర్థ్యం కలిగిన యంత్రం ధర రూ.89 లక్షలు, ఇందులో 25 శాతం నగదు మొత్తంతోపాటు జీఎస్టీ భాగాన్ని లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా ఇస్తాయి. 400 యాడ్స్‌ సామర్థ్యం కలిగిన ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రం ధర రూ.1.5 కోట్లు. దీని విషయంలోనూ 75 శాతం సబ్సిడీ లబ్ధిదారుడికి లభిస్తుంది.

రేపు కేంద్ర బృందం రాక

ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించడానికి కేంద్ర బృందం మంగళవారం నియోజకవర్గంలో పర్యటించనుంది. 200 యాడ్స్‌ యంత్రం మంజూరు కావాలంటే అర ఎకరా స్థలం, షెడ్డు తదితర సదుపాయాలను లబ్ధిదారుడు చూపించాలి. 400 యాడ్స్‌ యంత్రానికి ఎకరా స్థలం అవసరం. లబ్ధిదారులు చూపించగలిగే సదుపాయాలు, నమ్మకాన్ని బట్టి నాలుగు లేదా మూడు ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలకు ఓకే చెప్పనున్నారు. ఆ తర్వాత నిబంధనల మేరకు యంత్రాలను సమకూరుస్తారు.

రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి

75 శాతం సబ్సిడీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలు నియోజకవర్గానికి వస్తే పట్టు రైతుల జీవితాలు మరింత మెరగవుతాయి. వారి జీవన ప్రమాణాలూ పెరుగుతాయి.

- హనుమంతరాయ, ఏడీ, పట్టుపరిశ్రమ శాఖ

Updated Date - Apr 14 , 2025 | 12:30 AM