పంటలపై ఆగని గజదాడులు
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:56 AM
పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో ఒంటరి ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి.

కల్లూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో పంటలపై ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో ఒంటరి ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. వారం రోజులుగా పంటలను ధ్వంసం చేశాక అడవిలోకి వెళ్లిపోతున్న ఒంటరి ఏనుగు ముందుగా తూర్పు విభాగం అటవీప్రాంతం నుంచి ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో బయల్దేరింది. దేవళంపేట పంచాయతీలోకి అడుగుపెట్టిన ఒంటరి ఏనుగును అటవీశాఖ అధికారులు టపాకాయలు కాలుస్తూ వెంబడించారు. పాళెం పంచాయతీ గుండా కల్లూరు పంచాయతీ కట్టకింద ఇండ్లు వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు రైతు మధుబాబకు చెందిన అరటిచెట్లను ధ్వంసం చేసింది. తర్వాత ఇందిరానగర్ వద్ద ఉన్న హైవే రోడ్డును దాటి, పాతపేట పంచాయతీ మీదుగా సదుం మండలం గంటావారిపల్లె సమీపంలోని అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సమయంలోనే పాకాల మండలంలోని పదిపుట్లబైలు, ఈ-పాలగుట్టపల్లె పంచాయతీ మీదుగా రాయవారిపల్లె పంచాయతీలోకి మరో ఒంటరి ఏనుగు చేరుకుంది. అక్కడినుంచి కమ్మపల్లె పంచాయతీ బాలిరెడ్డిగారిపల్లెలోని రైతు మోహన్‌రెడ్డి, మనోజ్‌రెడ్డికి చెందిన వరి పంటను ధ్వంసం చేసి.. సమీపంలోని మామిడి చెట్లను విరిచేసింది. వ్యవసాయ డ్రిప్ పైపులను ధ్వంసం చేసింది. బండమీద కుప్పలు వేసిన వరిగడ్డిని చిల్లాడింది. మామిడి చెట్లను విరుచుకుంటూ తూర్పువిభాగం అటవీ ప్రాంతంలోని చాకలికోన, బోడబండ వద్దకు చేరుకుంది. సోమవారం ఉదయం అటవీశాఖ అధికారులు ధ్వంసమైన పంటలను పరిశీలించారు. చాకలికోన వద్ద ఒక ఒంటరి ఏనుగు, సదుం మండలం గంటావారిపల్లె మరో ఒంటరి ఏనుగు తిష్ఠ వేసినట్లు ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫి తెలిపారు.