టీడీఆర్ స్పెషల్ డ్రైవ్‌కు క్యూ కట్టిన బాధితులు
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:31 AM
మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన వారి టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధ్రువీకరణ స్పెషల్ డ్రైవ్ శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైంది.

తిరుపతి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన వారి టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల ధ్రువీకరణ స్పెషల్ డ్రైవ్ శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభమైంది. దాదాపు వందమందికి పైగా బాధితులు క్యూ కట్టారు. ఇదివరకే 45 మందికి ప్రీ అప్రూవల్ ఇవ్వగా, ఇప్పుడు మరో 35 మందికి ఆన్‌లైన్లో లాగిన్ చేశారు. ఒక్కో రోడ్డుకు సంబంధించి వేర్వేరుగా జాబితాలు తయారుచేసి దరఖాస్తులు స్వీకరించారు. భూతగాదాలున్న వాటిని మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. తొలిరోజు ప్రారంభంలో స్పెషల్ డ్రైవ్ కాస్త గందరగోళంగా మొదలైంది. బాధితులకు సరైన సమాధానం, భరోసా ఇవ్వడంలో విఫలమైనట్టు కనిపించింది. కార్పొరేషన్‌కు గిఫ్ట్‌డీడ్ ఇచ్చినవాటికి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం సాధ్యపడదని చెప్పడంతో కొందరు ఖంగుతిన్నారు. తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లతో గిఫ్ట్ డీడ్‌లకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలింపచేశారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొని టీడీఆర్ బాండ్ల దరఖాస్తులను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల వారీగా వివరాలు సేకరించారు. టీడీఆర్ బాండ్ల దరఖాస్తుల పరిశీలన, వాలిడేషన్, రిజిస్ట్రేషన్ చేసే విధానంపై వివరించారు. వైసీపీ నేతలు అడ్డగోలుగా మాస్టర్ ప్లాన్ రోడ్లువేసి, న్యాయం చేస్తామని నమ్మించి మోసం చేశారని ఈసందర్భంగా పలువురు లబ్ధిదారులు ఆవేదన చెందారు. ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజులపాటు కొనసాగనుంది.
పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన
టీడీఆర్ దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి, అన్‌లైన్ ద్వారా నమోదు చేస్తున్నట్లు కమిషనర్ మౌర్య మీడియాకు చెప్పారు. ఆ తర్వాత కమిటీ పరిశీలించి ఎండార్స్‌మెంట్ ఇస్తామని, తర్వాత గిఫ్ట్ డీడ్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో ఎక్కువ మంది నివాస యోగ్యమైన స్థలాలకు కమర్షియల్ డోర్ నంబర్‌తో రిజిస్టర్ చేశారన్నారు. అటువంటి వాటిని, సరైన ధృవ పత్రాలు జతపరచని వాటిని షార్ట్ ఫాల్ చేశామన్నారు. వీరందరూ సరైన ధ్రువపత్రాలతో వస్తే ఆన్‌లైన్ చేస్తామని తెలిపారు. ఇదివరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 9 దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా ఒకదానికి మాత్రమే సరైనదిగా గుర్తించి, తక్కిన ఎనిమిదింటికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకురావాలని షార్ట్‌ఫాల్ లిస్ట్‌లో పెట్టారు. ఈ మేళాలో తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్లు, డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.