Share News

ఇంకా ఎన్ని ఉన్నాయో?

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:25 AM

శేషాచల అటవీప్రాంతంలో ఎన్ని చిరుతల ఉన్నాయనే దానిపై అటవీశాఖ అధికారుల వద్ద ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారం లేదు. ఏ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్నాయనేదీ తేలడంలేదు. కానీ, చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగిందనేది వాస్తవం. 40కిపైగా ఉండొచ్చన్న అంచనా తప్ప, స్పష్టమైన లెక్కలేదు. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి చిరుతల గణన చేయాలి. అవి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో కొంతమంది సిబ్బంది వాటి పాదముద్రలు, వెంట్రుకలు, మలం సేకరణతో పాటు ట్రాప్‌ కెమెరాల ద్వారా ఎన్ని చిరుతలు ఉన్నాయనే అంచనా వేస్తారు.

ఇంకా ఎన్ని ఉన్నాయో?
వేదిక్‌ యూనివర్సిటీలోని బోనులో చిక్కిన చిరుతను పరిశీలిస్తున్న అధికారులు

ఫ మూడు నెలలుగా హడలెత్తించి బోనుకు చిక్కిన చిరుత

ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయ్‌?

...ఇదీ మూడు వర్సిటీల విద్యార్థులు, అటవీశాఖ అధికారులను వేధిస్తున్న ప్రశ్న. మూడు నెలలుగా హడలెత్తించిన చిరుత బోనుకు చిక్కడంతో ఒకవైపు ఊపిరి పీల్చుకున్నా.. మరోవైపు ఇంకా ఎన్ని ఉన్నాయనేది ఆందోళన కలిగిస్తోంది.

- మంగళం, ఆంధ్రజ్యోతి

శేషాచల అటవీప్రాంతంలో ఎన్ని చిరుతల ఉన్నాయనే దానిపై అటవీశాఖ అధికారుల వద్ద ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారం లేదు. ఏ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తున్నాయనేదీ తేలడంలేదు. కానీ, చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగిందనేది వాస్తవం. 40కిపైగా ఉండొచ్చన్న అంచనా తప్ప, స్పష్టమైన లెక్కలేదు. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి చిరుతల గణన చేయాలి. అవి ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో కొంతమంది సిబ్బంది వాటి పాదముద్రలు, వెంట్రుకలు, మలం సేకరణతో పాటు ట్రాప్‌ కెమెరాల ద్వారా ఎన్ని చిరుతలు ఉన్నాయనే అంచనా వేస్తారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు శాంచరీ ఏరియాలోని తిరుమల, కరకంబాడి, మామండూరులో ఒక్కో బీట్‌లో పది చొప్పున 12 బీట్లలో 120 ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంటే రిజర్వు ఫారెస్టులో కాకుండా అటవీప్రాంతం వెలుపలా చిరుతలు తిరిగే ప్రాంతాలను గుర్తించి వీటిని అమర్చారు. ఒక్కో కెమెరా మధ్య దూరం 100 మీటర్లు. మార్చినెల 10న ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను ఈనెల 20వ తేదీ వరకు నిఘాలో ఉంచుతారు. ఆ తర్వాత వీటిని తీసి పరిశీలిస్తారు. ట్రాప్‌ కెమెరాలకు చిక్కిన చిరుతల ఆనవాళ్ల ఆధారంగా అవి ఎన్ని ఉన్నాయనే దానిపై ఒక అంచనాకు వస్తారు. ఈ కెమెరాలను శాంచరి ఏరియాలో మాత్రమే ఏర్పాటు చేయడంతో పూర్తిస్థాయిలో చిరుతల సంఖ్య తేలే అవకాశం లేదు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చిరుతల గణనగురించి ఒక ప్రణాళికతో ముందుకు వెళితే తప్ప వాటి సంఖ్య తెలిసే అవకాశం లేదు.

అప్పుడప్పుడూ బోన్లుపెట్టి..

అటవీప్రాంతం నుంచి చిరుతలు సమీప ప్రాంతాల్లో శునకాలపై దాడి చేసినప్పుడు, ప్రజలు భయాందోళనకు గురైనప్పుడు తాత్కాలిక ఉపశమనంకోసం బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. పట్టుబడ్డ వాటిని సుదూర ప్రాంతంలో వదిలేస్తున్నారు. ఇలా, తాజాగా ఎస్వీయూ, వెటర్నరీ, వేద వర్సిటీలు, క్వార్టర్స్‌లో ఉన్న వారికి మూడు నెలలుగా ఓ చిరుత కంటిమీద కునుకు లేకుండా వణికించింది. వర్సిటీలలో రాత్రి పూట సంచరిస్తూ పెంపుడు, వీధి కుక్కలు, జింకలపై దాడి చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాలను, ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. వేద వర్సిటీ శారదమ్మబిల్డింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన బోన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ చిరుత పట్టుబడింది. ఇది ఆడ చిరుతని అధికారులు తెలిపారు. చిరుతను పరిశీలించిన ఎస్వీ జూపార్కు డాక్టర్‌ అరుణకుమార్‌ ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో దీనిని అటవీశాఖ అధికారులు చిట్వేలు అటవీప్రాంతంలో వదలిపెట్టారు. ఇది ఈ ప్రాంతవాసులకు కొంత ఊరట కలిగినా ఇంకా ఎన్ని సంచరిస్తున్నాయనే ఆందోళనలో ఉన్నారు.

ఇది సంతాన అభివృద్ధి సమయం

ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు చిరుతలు తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి. ఈ సమయంలో తమ పిల్లలకు దూరంగా వెళ్లకుండా, ఆహారాన్ని సులభంగా వేటాడి తెచ్చుకునేలా అనువైన ప్రాంతాలను ఎంచుకుంటాయి. అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చిరుతలకు సులభంగా దొరికే శునకాలు, చిన్నచిన్న జీవాలపై దాడి చేస్తాయి వాటిని తమ పిల్లలకు ఆహారంగా తీసుకెళతాయి. ఈ లెక్కన గత కొంతకాలంగా చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాలను పరిశీలిస్తే అటు వేద వర్సిటీ నుంచి ఎస్వీయూ, వెటర్న యూనివర్సిటీలు, వ్యవసాయ కళాశాల, నగరవనం, జీవకోన, తిమ్మినాయుడుపాలెం, మంగళం, కరకంబాడి ప్రాంతాల్లోను.. తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు చిరుతల సంచారం ఎక్కువగా ఉండటం గమనార్హం. నడక మార్గంలో చిన్నారులపై చిరుత దాడి ఘటనల తర్వాత ఏడో మైలు, నరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోన్లలో ఐదు చిరుతలు పట్టుబడ్డాయి. గతంలో వెటర్నరీ వర్సిటీ వద్ద ఒకటి, మంగళం వద్ద ఒకటి బోన్లకు చిక్కాయి. ఇపుడు తాజాగా వేద వర్సిటీ వద్ద చిరుత బోనులో పడింది.

Updated Date - Apr 07 , 2025 | 01:25 AM