ఆగని వైసీపీ అరాచకాలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:34 AM
ప్రభుత్వం మారినా పుంగనూరులో టీడీపీ నేతలే బాధితులు వైసీపీ హయాం నాటి పోలీసులకు స్థానచలనాలేవీ? ఎస్పీ మణికంఠ తీరుపై టీడీపీ ఎమ్మెల్యేల అసహనం

చిత్తూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ పుంగనూరులో అరాచకమే రాజ్యమేలింది. రాష్ట్రంలో అధికారం మారినాక అయినా పరిస్థితులు చల్లబడతాయని ప్రజలు ఆశపడ్డారు. తమకు న్యాయం జరుగుతుందని వైసీపీ బాధితులైన టీడీపీ కార్మకర్తలు నమ్మారు. కానీ ఏం మారలేదని శనివారం పట్టపగలు జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య సంఘటన నిరూపిస్తోంది.టీడీపీకి నమ్మకమైన కార్యకర్తను వైసీపీ నాయకుడు నరికి చంపిన తీరు అందరినీ భయపెడుతోంది. పోలీసులు, ఇతర శాఖల అధికారులూ కూడా ఇప్పటికీ పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నారనే ఆరోపణలకు ఈ సంఘటన బలం చేకూరుస్తోంది. వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని పదేపదే వేడుకున్నా రామకృష్ణ ప్రాణాలను కాపాడలేకపోయారు. వెంకట్రమణ అనే వైసీపీ కార్యకర్త చేతిలో దారుణంగా టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ పరిణామంతో జిల్లాలో వైసీపీ గత అరాచకాల గురించీ.. కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగుతున్న నిర్లక్ష్యం గురించీ చర్చ జరుగుతోంది.
వెయ్యిమందిపై అక్రమ కేసులు, రౌడీషీట్లు..
2023 ఆగస్టులో అంగళ్లు వద్ద చంద్రబాబును అడ్డుకున్న ఘటనలో ఏకంగా వందలమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. భార్యా పిల్లల్ని వదిలేసి జైళ్లలో మగ్గారు. కేసుల భయంతో చాలామంది ఊర్లొదిలి వెళ్లిపోయారు. టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, బీసీవై అధినేత రామచంద్రయాదవ్ పర్యటనలను అడ్డుకోవడం, దాడులు చేయడం అప్పట్లో పరిపాటిగా మారింది. ఇలా పుంగనూరులో గత ఐదేళ్ల పాటు సుమారు వెయ్యిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడంతో పాటు రౌడీషీట్లను నమోదు చేశారు.
సీఎం చెప్పినా..
చంద్రబాబు సీఎం అయ్యాక జనవరి 7న రెండోసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పర్యటించారు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల మీద హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, రౌడీషీట్లను తెరిచారని.. అవన్నీ అక్రమమేనని.. వాటన్నింటినీ ఎత్తేయాలని ద్రావిడ వర్శిటీలోని ఆడిటోరియంలో ఎస్పీ మణికంఠకు చెప్పారు.అయినప్పటికీ ఇంతవరకు ఆయా కేసుల గురించి సమీక్షించలేదు. ఎత్తేయలేదు.
పోలీసులు అదే స్థానాల్లో..
సాధారణంగా ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారుల బదిలీలు కూడా జరుగుతాయి. అవసరాన్ని బట్టి ఆయా జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయి అధికారుల బదిలీలు కూడా జరుగుతుంటాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల అండతో జిల్లాలో అరాచకాలు చేసిన పోలీసులు ఇంకా అదే స్థానాల్లో కొనసాగుతుండడం ఆశ్చర్యకరం. వారికి స్థానిక వైసీపీ నాయకులతో సఖ్యత ఉంది. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తన నియోజకవర్గంలో ఎస్‌ఐ, కానిస్టేబుళ్లను మండలాలు మార్చాలని, వైసీపీ హయాం నుంచీ అక్కడే ఉండడంతో ఇబ్బందిగా ఉందని ఎస్పీ మణికంఠకు నాలుగు నెలల కిందట విన్నవించినా స్పందన లేదు. ఈ విషయాన్ని ఆయన శనివారం మదనపల్లెలో ప్రస్తావించి ఎస్పీపై అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
సదుం మండలం పాలమంద గ్రామంలో ఎస్సీ ఎస్టీల భూముల్ని అక్కడి వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని బాధితులంతా తమ వద్దనున్న పట్టాదారు పుస్తకం వంటి అన్నిరకాల డాక్యుమెంట్లతో స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. స్పందన లేకపోవడంతో చిత్తూరుకు వచ్చి ఎస్పీకి, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకూ వారికి న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వంలో కూడా పెద్దిరెడ్డికే అనుకూలంగా అధికారులు పనిచేస్తున్నారంటూ ఫిబ్రవరి 10వ తేదీన సదుం మండల వాసులు పెద్దఎత్తున మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. భూములు కబ్జా చేశారని కొందరు, అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని మరికొందరు ఫిర్యాదు చేశారు.
ప్రాణహాని ఉందని పోలీసులను వేడుకున్నా....
వైరల్ అయిన రామకృష్ణ వీడియో
తొలినుంచీ తెలుగుదేశం పార్టీని వీడకుండా అనేక ఇబ్బందులు, దాడులు, కేసులు భరిస్తూ వచ్చిన రామకృష్ణ చివరకు వైసీపీ కార్యకర్త చేతిలో హతమారిపోవాల్సి వచ్చింది. పుంగనూరు నియోజకవర్గంలో చాలా మంది ముఖ్య నాయకులు టీడీపీని వీడినా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన కాగతి రెడ్డెప్ప కుమారుడు రామకృష్ణ(55) కుటుంబం మాత్రం పార్టీ పట్ల అంకితభావంతో కొనసాగింది. కృష్ణాపురంలో వైసీపీ కార్యకర్తగా పెద్దిరెడ్డి వెంట ఉన్న కె.శ్రీరాములు కుమారుడు కాగతి వెంకటరమణ(45) గ్రామంలో టీడీపీని లేకుండా చేయాలని రామకృష్ణ కుటుంబంతో తరచూ గొడవకు దిగుతుండడంతో వీరి మధ్య రాజకీయ కక్షలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో ప్రభుత్వ భూములను వైసీపీ పాలనలో ఆక్రమించి వ్యవసాయ పొలాలుగా మార్చినట్లు అధికారులకు, టీడీపీ నాయకులకు రామకృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో రామకృష్ణపై వెంకటరమణ కక్ష అధికమైంది.గత నెల 10వ తేదీన రామకృష్ణ పొలానికి మట్టిని తరలిస్తుండగా వెంకటరమణ స్థలంలో టిప్పర్ వెళ్లిందని ఇరువర్గాలు ఘర్షణపడి పుంగనూరు వైద్యశాలలో చేరడంతో సీఐ శ్రీనివాసులు 17వ తేది ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. తర్వాత మళ్లీ రామకృష్ణ, ఆయన కుమారుడు శివ, కోడలు భార్గవిపై వెంకట్రమణ వర్గీయులు దాడి చేశారు. అలాగే 15 రోజుల క్రితం రామకృష్ణ పెద్దకుమారుడు శివపై వెంకటరమణ దాడి చేసి చెయ్యి విరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఫిర్యాదు తీసుకోకుండా రామకృష్ణపై మండిపడి, తమపై దాడులు చేసిన వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి కొద్దిసేపటికే విడిచిపెట్టి తమకు అన్యాయం చేస్తున్నట్లు రామకృష్ణ ఒక వీడియో విడుదల చేశారు. మళ్లీ శుక్రవారం గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపు సందర్భంగా రామకృష్ణ, వెంకటరమణ ఘర్షణ పడుతుండగా సీఐ ఇరువర్గాలనూ మందలించారు. రాజకీయకక్షలు శృతి మించిన నేపథ్యంలో వెంకటరమణ శనివారం ఉదయం పథకం ప్రకారం బోయకొండ రోడ్డులో వేటకోడవలితో రామకృష్ణ కుమారుడు సురేష్‌పై దాడికి ప్రయత్నించాడు.గమనించిన సురేశ్ చేయి అడ్డుపెట్టడంతో కొడవలి వెనుకవైపు తగిలి గాయాలయ్యాయి.సురేష్ తప్పించుకుని రోడ్డుపై వెళుతున్న ద్విచక్రవాహనంలో ఎక్కి వెళ్లిపోయాడు. అదే సమయానికి రామకృష్ణ ట్రాక్టర్‌తో పొలం దున్ని ఇంటికి రాగా వెంకటరమణ అతడి చేరుకుని రామకృష్ణ కాలు, తొడపై కొడవలితో నరకడంతో రామకృష్ణ రోడ్డుపై పడిపోయాడు. మెడపై నరికి వ్యవసాయ పొలాల్లోకి వెంకటరమణ పరుగులు తీయడాన్ని గ్రామస్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.గాయపడిన రామకృష్ణను చికిత్స నిమిత్తం మదనపల్లెకు అక్కడినుంచి తిరుపతికి తరలిస్తుండగా మృతి చెందాడు.ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు,బందువులు కృష్ణాపురంలో రోడ్డుపైకి వచ్చి బస్సులు ఆపి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా వైసీపీ నాయకులు వెంకటరమణ, గణపతి, మహేశ్, త్రిలోకాల నుంచి ప్రాణహాని ఉందని మృతుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే హత్య జరిగిందని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంపై మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి.కృష్ణాపురంలో పుంగనూరు రూరల్ సీఐ రాంభూపాల్‌రెడ్డి ఆందోళనకారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇస్తూ పోలీసు పికెటింగ్ పెట్టారు. మదనపల్లె ఆస్పత్రి వద్ద మృతుడి భార్య దేవమ్మ, కోడలు భార్గవి మాట్లాడుతూ రామకృష్ణను చంపిన వైసీపీ కార్యకర్త వెంకటరమణను చంపితేనే తాము శవం తీసుకెళతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు ఆరా
రామకృష్ణ హత్యా ఘటనపై శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, అనిత, రాంప్రసాద్‌రెడ్డి ఆరా తీశారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి జరిగిన విషయాలను తెలియజేసి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు బాధితులను ఓదార్చాలని హైకమాండ్ ఆదేశించింది.రామకృష్ణ కుటుంబసభ్యులను హోంమత్రి అనిత ఫోన్‌లో పరామర్శించి సానుభూతి తెలిపారు.కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఎస్పీ తీరువల్లే ప్రాణాలు పోయే పరిస్థితి
జిల్లాలో ఎస్పీ తీరు సరిగా లేకే మా నాయకుల్ని బెదిరించే స్థాయి నుంచి ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చింది. సీఐని కాదు.. ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేయాలి. మా పలమనేరు నియోజకవర్గంలో కూడా ఇంకా వైసీపీతో అంటకాగిన పోలీసులు పనిచేస్తున్నారు. పక్క పక్క మండలాలకు బదిలీ చేయమని ఎస్పీకి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎస్పీకి ఫోన్ చేయడమే మానేశాను. మా నాయకుల్ని, కార్యకర్తల్ని చంపేస్తుంటే చూస్తూ ఇంట్లో కూర్చోమని మా సీఎం చెప్పలేదు కదా.?
- మదనపల్లె ఆసుపత్రిలో అమరనాథ రెడ్డి